వైసీపీ నేతలకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నివాసం, టీడీపీ కార్యాలయంపై దాడి కేసుల్లో ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
దీంతో పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ అంశంపై మధ్యాహ్నం తర్వాత చేపడుతామన్న హైకోర్టు..వైసీపీ నేతలు చేసిన ఈ విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వేట మొదలు పెట్టారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ , నందిగం సురేష్ , అప్పిరెడ్డి, తలశిల రఘురాం నిందితులుగా ఉండగా.. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు. వైసీపీ నేతల బెయిల్ ను హైకోర్టు తిరస్కరించడంతో వైసీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
పోలీసులు వస్తారనే సమాచారంతో మాజీ ఎంపీ నందిగం సురేష్ పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లగా..అక్కడ లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. ఆయన ఎక్కడికి వెళ్ళారు..? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.