జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ఎటాక్‌ను ఎదుర్కోవడంపై… కేటీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ గతంలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు చేసిన వాదనలకు.. ఎన్జీటీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత చేస్తున్న వాదనలకు పొంతన లేకపోవడంతో.. రేవంత్ రెడ్డి వర్గం దీన్నో అడ్వాంటేజ్‌గా తీసుకుంది. తాజాగా… ఎన్డీటీ నోటీసులపై.. కేటీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఎన్జీటీ
నిజానిజాలు పరిశీలించకుండానే ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. ఫాంహౌస్ తనది కాదని హైకోర్టుకు నివేదించారు. ఎన్జీటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ..రాజకీయ కక్షపూరిత పిటిషన్ అని కేటీఆర్ వాదించడంతో.. హైకోర్టు ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది.
అయితే.. ఫామ్‌హౌస్ తనది కానప్పుడు… కేటీఆర్ ఎందుకు అంత కంగారు పడుతున్నారన్న విమర్శలు రేవంత్ వర్గం నుంచి రావడానికి కేటీఆర్ అవకాశం కల్పించినట్లయింది. జన్వాడ ఫామ్‌హౌస్ విషయంలో ఎన్జీటీ నేరుగా కేటీఆర్‌కు కూడా నోటీసులు ఇచ్చింది. తనది కాదు అన్న విషయాన్ని ఎన్జీటీకే నోటీసులకు సమాధానం రూపంలో తెలియచేస్తే పనైపోయేది..కానీ… హైకోర్టులో సవాల్ చేశారు. జీవో 111కు విరుద్దంగా నగర శివార్లలో కేటీఆర్ ఫాంహౌస్ కట్టారని రేవంత్ రెడ్డి ఎన్టీటీకి ఫిర్యాదు చేశారు. ఎన్జీటీ చెన్నై బెంచ్.. విచారణకు ఆదేశించింది. నోటీసులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, హెచ్ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో కూడిన కమిటీ విచారించి కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అయితే కేటీఆర్ ఆ ఫామ్‌హౌస్ తనది కాదని వాదిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ నేతలు.. కేటీఆర్ ఆ ఫామ్‌హౌస్‌ను లీజుకు తీసుకున్నారనిచెప్పారు. ఇటీవల రేవంత్ కొన్ని డాక్యుమెంట్లు రిలీజ్ చేశారు. కేటీఆర్‌ది కాకపోతే.. ఎందుకు దాన్ని కూల్చడం లేదని సవాల్ చేశారు. దీంతో ఇదో రాజకీయ అంశమైపోయింది.