వివేకా హత్య కేసులో బలవంతపు చర్యలు తీసుకోకుడా సీబీఐని ఆదేశించాలంటూ… వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో సీబీఐ తదుపరి చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయినట్లయింది. మూడు రోజుల కిందట తీర్పు రిజర్ చేసిన హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకూ అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం వెల్లడించింది.
సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయం లేకపోవడంతో అవినాష్ రెడ్డి గురువారం విచారణకు కూడా డుమ్మా కొట్టారు. గురువారం కూడా ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ రాలేనని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇప్పటి వరకూ రిమాండ్ రిపోర్టులు, కౌంటర్ల ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం అవినాష్ రెడ్డి ప్రధాన అనుమానితుడిగా ఉన్నారు. అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రిని కూడా అదుపులోకి తీసుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నామని నేరుగా హైకోర్టుకే సీబీఐ చెప్పింది. ఇలాంటి సమయంలో దర్యాప్తు అధికారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ .. దర్యాప్తు ఫలానా కోణంలో చేయడం లేదని ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. ఇప్పుడీ పిటిషన్ కొట్టేయడంతో అవినాష్ రెడ్డి అరెస్టుకు మార్గం సుగమం అయింది.
ఈ కేసులో ఇప్పటికే సీబీఐ హైకోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో అన్ని వివరాలు సమర్పించింది. అవినాష్ ను ప్రశ్నించిన ఆడియో, వీడియోలను కూడా సమర్పించింది. అయితే ఈ కేసులో వీడియోగ్రఫీ అవసరం లేదని.. ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డిని.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.