హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్ ఆఫ్ లా సరిగ్గా అమలు కాకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తామని హైకోర్టు సూటిగా హెచ్చరికలు జారీ చేసింది. గతంలో ఈ అంశంపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే సీఐడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో హైకోర్టు రిజిస్ట్రార్ ..స్వయంగా పిటిషన్ వేశారు. సీఐడీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదా? .. అయితే పార్లమెంట్‌కు వెళ్లి ఏపీ హైకోర్టును మూసేయమని అడగమని ప్రభుత్వ న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించబోమని స్పష్టం చేసింది. హైకోర్టుపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటిపై ఫిర్యాదు చేసినా స్పందించకపోడం.. దీని వెనుక కుట్ర ఉందేమో తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. జడ్జీలపై ఆరోపణలతో హైకోర్టే పిటిషన్ వేసుకోవాల్సి వచ్చింది .. ఇలాంటి స్థితి ఎన్నడూ లేదని.. జ్యుడీషియరీ స్తంభం బలహీనమైతే ‘సివిల్ వార్’కు అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టింగ్‌లను అనుమతించరాదని ఆయా సంస్థలకు హైకోర్టు సూచింది. ఆ సంస్థల తరపున హాజరైన ఢిల్లీ ప్రముఖ లాయర్లు న్యాయవ్యవస్థ గౌరవాన్ని పెంచేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యల కేసుపై సీఐడీ అదనపు అఫిడవిట్ సమర్పించింది. పరిశీలించేందుకు తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.