అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పరిశ్రమలో ఏం జరిగింది..? పరిశ్రమలో ఉన్న లోపాలపై ఈ కమిటీ విచారణ చేపడుతుందన్నారు. పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని… భద్రత విషయంలో చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయని వ్యాఖ్యానించారు.
అచ్యుతాపురం సెజ్ లో ఫార్మా పరిశ్రమను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖలోని ఆసుపత్రుల్లో ఫార్మా కంపెనీ బాధితులను పరామర్శించాను.. మృతులు, బాధితుల కుటుంబ సభ్యులను ఓదార్చానన్నారు. బాధితులను ఆదుకుంటామని..మృతులకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికీ 25లక్షల చొప్పున అధికారులు చెక్కులు అందజేస్తారన్నారు.
Also Read : ఏం భయపడొద్దు…అచ్యుతాపురం బాధితులకు సీఎం భరోసా!
పరిశ్రమలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. నిబంధనల మేరకు ఎస్వోపీ అనుసరించలేదని తెలుస్తోందని… గత ఐదేళ్లలో విశాఖలో 119ఘటనల్లో 120మంది మృతి చెందారని తెలిపారు. పరిశ్రమల్లో పూర్తి స్థాయి భద్రత ప్రమాణాలు చేపట్టకపోవడంతోనే ఫార్మా కంపెనీలో భారీ పేలుడు జరిగిందన్నారు. రెడ్ కేటగిరిలోని ఇండస్ట్రీస్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోన్న కమిటీ పరిశ్రమలకు ఉన్న ఇబ్బందులపైనా కూడా విచారణ చేపడుతుందని చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలు బాధ్యత లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తే కుదరదు అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. కమిటీ నివేదిక సమర్పించాక ఈ ఘటన విషయంలో ఎవరు తప్పు ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం.. ప్రమాదాలు భవిష్యత్ లో జగరకుండా చర్యలు చేపడుతామని అన్నారు.