సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు సాయి యోగేశ్వర్ ఏపీ ప్రభుత్వానికి… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల వైద్యానికి అయిన ఖర్చులన్నింటినీ ఏపీ ప్రభుత్వం భరించేలా జగన్ ఆదేశాలిచ్చారని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం సీఎంవో నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని.. సీతారామశాస్త్రి ఆరోగ్యం గురించి వాకబు చేశారన్నారు.
మరణ ధృవీకరణ తర్వాత ఆస్పత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని.. వైద్యం కోసం ఆస్పత్రికి కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేలా ఆస్పత్రికి ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. అంత్యక్రియలకు హాజరైన మంత్రి పేర్ని నాని ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారని సిరివెన్నెల కుటుంబసభ్యులు తెలిపారు. సిరివెన్నెలగారి పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోందన్నారు.
అయితే ఎంత మొత్తం ఖర్చు అయింది..ఎంత రిలీజ్ చేశారు అన్నదానిపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. సిరివెన్నెల కుటుంబం మాత్మరే స్పందించింది. ప్రభుత్వం జీవోలను సీక్రెట్‌గా ఉంచడం ప్రారంభించి చాలా కాలం అయింది కాబట్టి… ఎంత ఇచ్చిందనేది తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది.