జనసేన లేకుండా.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఉండవు అంటూ పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో గర్జించారు. ఈ డైలాగ్ చాలా పవర్ ఫుల్‌గా ఉంది కానీ.. ఆయన మాటలకు.. చేతలకు ఎక్కడా పొంతన కనిపించడం లేదు. చేజేతులా .. తెలంగాణలో జనసేన పార్టీని లేకుండా చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సన్నద్ధత లేదన్న కారణంగా పోటీ చేయని పార్టీకి ఎక్కడైనా లైఫ్ ఉంటుందా..?
తెలంగాణలో జనసేనను నిర్వీర్యం చేసింది నువ్వేగా పవన్..!
పార్టీ పెట్టిన దాదాపు ఐదేళ్ల తర్వాత ..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే… ఇంకా ప్రిపేర్ కాలేదని జనసేన పోటీ చేయడం లేదని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పోటీ చేయాలని తెలంగాణ నుంచి అభిమానులు వచ్చి… ధర్నా చేసినా… పవన్ కల్యాణ్ మాత్రం.. మీనమేషాలు లెక్కించి.. చివరికి పోటీ లేదని తేల్చారు. పవన్ కల్యాణ్ ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అది. ఆ విషయం.. అప్పట్లో జరిగిన పరిణామాలు చూస్తే తెలిసిపోతుంది. జనసేన స్థాపించిన.. మూడేళ్ల తర్వాత ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి .. ఎన్నికల్లో పోటీ చేసింది. పొత్తులు కూడా పెట్టుకుంది. కానీ.. అంతకు ముందే.. మూడేళ్ల కిందటే ఏర్పాటు చేసిన జనసేన మాత్రం.. సన్నాహాలు చేసుకోలేదని.. కారణం చెప్పింది. ఇక తెలంగాణలో జనసేన ఉనికి ఎలా ఉంటుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇక ఎలా ఉనికి ఉంటుంది..?
జనసేనతో పొత్తులు పెట్టుకుంటామంటూ… బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో కూటమి కట్టిన సీపీఎం… పదే పదే జనసేన కార్యాలయానికి .. విజ్ఞాపనలు పంపింది. మొదట్లో పట్టించుకున్న వారు… ఆ తర్వాత లైట్ తీసుకున్నారు. సీపీఎం తెలగాణ కార్యదర్శి.. ఫోన్లు చేసినా జనసేన నుంచి స్పందన రాలేదు. దాంతో.. ఆయన పవన్ కల్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అని నిష్టూరమాడాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితితో కుమ్మక్కయి.. ఆ పార్టీకి మద్దతుగానే… తన సామాజికవర్గాన్ని .. తన అభిమానుల్ని మళ్లించారనేది.. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఆ మద్దతు తీసుకున్న… టీఆర్ఎస్.. ఇప్పుడు.. జనసేన అనే పార్టీ ఒకటి ఉందని గుర్తించడానికి కూడా సిద్ధపడటం లేదు. ఇప్పుడు.. కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు కమిటీల్ని ప్రకటించినంత మాత్రాన… జనసేన ఉనికి నిలుపుకున్నట్లు కాదు.
డైలాగులు చెబితేనే రాజకీయం కాదు..!
తెలంగాణలో జనసేన లేదని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా.. ఇలాంటి ప్రధాన ఎన్నికలను మిస్ చేసుకున్న తర్వాత.. ఉద్దేశపూర్వకంగా.. వైదొలిగిన తర్వాత ఆ పార్టీ ఆ రాష్ట్రంలో మళ్లీ నిలబడుతుందని అనుకోవడం అమాయకత్వం. ఈ విషయం పవన్ కల్యాణ్‌కి కూడా తెలుసేమో..?. తెలియదు అనుకుంటే.. కచ్చితంగా రాజకీయ అమాయకత్వమే. కొండారెడ్డి బురుజు దగ్గరకు వెళ్లి.. సినిమా స్టైల్లో కళ్లు పెద్దవి చేసి… పిడికిలి బిగించి.. జనసేన లేకుండా.. తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఉండవని… డైలాగ్ కొట్టినంత మాత్రాన… జనసేన ప్రజల్లోకి వచ్చేయదు. దానికి తగ్గట్లుగా రాజకీయం చేయాలి. తెలంగాణ విషయంలో అలాంటి రాజకీయం చేయడం ఎప్పుడో మర్చిపోయారు. తెలంగాణలో జనసేన ఉనికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయం తీసుకున్నప్పుడే పోయింది.