తెలంగాణలో పదహారు స్థానాల్లో గెలిచి.. ఢిల్లీని శాసిస్తామని.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ప్రజలకు ఆ మాత్రం నమ్మకం కలిగించి… విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ.. శాసించడం అనే మాట చాలా పెద్దదైపోతుందనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. ఎందుకంటే.. భారత పార్లమెంట్లో ఉన్న స్థానాలు మొత్తం 542. అందులో.. కేటీఆర్ గెలుస్తానని చెబుతున్నవి పదహారు మాత్రమే. 542లో ఈ పదహారు స్థానాలు ఎంత..? . రాజకీయాల్లో ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. ఏ మాత్రం తేడా వచ్చినా.. సీట్లు తగ్గిపోతాయి. పైగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా లేవు కాబట్టి… జాతీయ అంశాల ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది. రాహుల్ వర్సెస్ మోడీ అన్నట్లు మారితే.. ఓట్లు చీలిపోతాయి.
సరే పరిస్థితులు అన్నీ కలసి వచ్చి పదహారు సీట్లు గెలుచుకుంటే ఏం చేయగలరు..? ఢిల్లీలో చక్రం తిప్పాలంటే.. పరిస్థితి కలిసి రావాలి. కాంగ్రెస్ పార్టీకి కానీ.. బీజేపీకి కానీ.. ఆ 16 సీట్లు అవసరం పడాలి. అంటే.. ఆ ఒక్క 16 సీట్లు ఒక్క టీఆర్ఎస్కే రావాలి. కాంగ్రెస్ లేదా.. బీజేపీకి మాత్రమే ఆ పదహారు సీట్లు తగ్గాలి. కానీ.. ఇప్పుడు… ఆ పరిస్థితి లేదు. 2014లో మోడీకి క్లియర్ మెజార్టీ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో మోడీకి క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం లేదు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, కర్ణాటకల్లో విపక్షాలన్నీ కలిసిన తర్వాత చాలా సీట్లు తగ్గిపోనున్నాయి. ఇక్కడ తెలంగాణలో చూశాం.. ఐదు అసెంబ్లీ సీట్లు ఉంటే… నాలుగు కోల్పోయారు. ఒక్కటి మాత్రమే నిలబెట్టుకున్నారు. ఇక్కడ ఓ పార్లమెంట్ సీటు ఉంది. అది కూడా గెల్చుకుంటారన్న గ్యారంటీ లేదు. అంటే.. కచ్చితంగా బీజేపీకి సీట్లు తగ్గుతాయి.
కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. దేశంలో ఇప్పుడు చాలా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటికీ సీట్లు పెరగబోతున్నాయని చెబుతున్నారు. అన్ని పార్టీలు.. చక్రం తిప్పడానికి రెడీ అయిపోతున్నాయి. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్, స్టాలిన్ , నవీన్ పట్నాయక్, చంద్రబాబు ఇంకా చెప్పాలంటే.. జగన్ కూడా… రెడీ అయిపోతున్నారు. వీరిలో ఎవరికైనా పదహారు కన్నా ఎక్కువ సీట్లు రావా..? వారే కీలకం కాబోరా..?. ఈ విషయాలన్నీ కేటీఆర్కు తెలియవా.. అంటే తెలుసు. కానీ చక్రం తిప్పేయాలన్న ఆశ.. ప్రజల్లో ఆవేశం కల్పించడానికి అలా చెబుతున్నారని అనుకోవాలి.