భరతమాత ముద్దుబిడ్డ, శత్రు సైనికుల చేతికి చిక్కినా.. కళ్లలో ఇసుమంతైనా భయం కనిపించనివ్వని… ఫైటర్ పైలట్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం ఎదురు చూస్తోంది. అయితే పాకిస్తాన్ తీరు చూసిన వారు.. మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. కులభూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ ఎంత కర్కశంగా వ్యవహరిస్తోందో అందరూ చూశారు. ఇప్పుడు అభినందన్ పరిస్థితేమిటన్నదే చర్చ. ఆయనను క్షేమంగా తీసుకురాకపోతే అది ప్రభుత్వ చేతకానితనంగా ముద్రపడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అబినందన్‌ను క్షేమంగా తీసుకు రావడానికి కొన్ని క్లిష్టమైన మార్గాలున్నాయి. అందులో కీలకమైనది జెనీవా ఒప్పందం. యుద్ధ ఖైదీల విషయంలో ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందం అది.
యుద్ధ సమయంలో పట్టుబడిన సైనికులు, పౌరులందరినీ యుద్ధఖైదీలుగా పేర్కొంటారు. వీరి రక్షణ కోసం…196 దేశాల ఆమోదంతో… ఒప్పందం చేసుకున్నారు. యుద్ధఖైదీలను మానవతా దృక్పథంతో చూడాలి. సరైన న్యాయ విచారణ, తీర్పు లేకుండా వారికి మరణదండనతో సహా ఎలాంటి శిక్షలూ విధించకూడదు. దీని ప్రకారం యుద్ధఖైదీలను బందీలుగా తీసుకున్న దేశం వారి నుంచి కేవలం వారి పేరు, సైన్యంలో వారి ర్యాంకు, నంబరు మాత్రమే తెలుసుకోవాలని స్పష్టంగా సూచిస్తోంది. అంతేగానీ శత్రుదేశానికి సంబంధించిన సమాచారం రాబట్టేందుకు వారిని హింసించటం, శారీరకంగా మానసికంగా వారిని హింసలకు గురి చేయకూడదు. కచ్చితంగా దీనికి తగ్గట్లుగానే.. పాక్ సైన్యం అభినందన్ విషయంలో వ్యవహారించింది. సైన్యంలో ఆయన హోదా, ర్యాంక్, నంబర్ మాత్రమే తెలుసుకుంది. మిగతా విషయాలు తెలుసుకున్నా… ఈ వివరాలు మాత్రమే తెలుసుకున్నట్లు వీడియో విడుదల చేసి.. తాము జెనీవా ఒప్పందం ప్రకారం వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చింది. అలాగే.. స్థానికులు కొడుతూంటే.. సైన్యం రక్షించిందని… అభినందన్తోనే చెప్పించారు. ఇది కూడా..జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పడానికే..!
అయితే.. ఈ జెనీవా ఒప్పందం… యుద్ధ ఖైదీలను.. వారి వారి దేశాలకు అప్పగించాలనేమీ నిర్దేశించడం లేదు. అదే సమయంలో… ఇప్పుడు.. భారత్ – పాకిస్థాన్ మధ్య ఎలాంటి యుద్ధం జరగడం లేదు కాబట్టి.. అసలు అభినందన్‌ను యుద్ధఖైదీగా అభివర్ణించడానికి కూడా అవకాశం లేదనే వాదన ఉంది. అభినందన్ యుద్ధంలో పట్టుబడిన ఖైదీ కూడా కాదు. ఈ విషయంలో పాకిస్తాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి.. అభినందన్‌ను… విడిపించడానికి చాలా తేలికైన మార్గాలే ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా.. రాజకీయం చేసుకోకుండా… ఓ వీరుని ప్రాణానికి ఓట్ల లెక్కలు వేసుకోకుండా… ప్రయత్నిస్తే.. వారంలోనే… అభినందన్ ఇండియాకు రావొచ్చు. దీనికి.. గతంలో.. కార్గిల్ యుద్ధ సమయంలో.. ఇలానే పాకిస్థాన్‌కు పట్టుబడిన … ఫైటర్ పైలట్ కంభంపాటి నచికేత.. వారంలోనే స్వదేశానికి చేరుకున్న వైనం సాక్ష్యం. మరి కేంద్రం ఏం చేస్తుందో..?