టి.ఆర్.ఎస్. అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని నేతలు అభివర్ణించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో కూడా తామే గెలవడం ఖాయం అని ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి చెప్పుకుంటారు. గడచిన మూడు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి అంతా తెరాస అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే చేసి చూపినం అంటారు! అభివృద్ధి పేరుతో గొర్రెలు పంచారు, చీరలు పంచారు, ఇంకేవేవో కానుకలు ఇచ్చామంటున్నారు. తెరాసపై ప్రజా వ్యతిరేకతే లేదన్నట్టుగా చిత్రీకరిస్తారు. కాంగ్రెస్ కి భయపడేది లేదంటారు, టీడీపీకి బదులు పలికేది లేదంటారు, భాజపా తమకు సమాన ప్రత్యర్థి కాదనీ చెబుతారు! తెరాసలో ఇంత ఆత్మస్థైర్యం తొణికిసలాడుతున్నప్పుడు… టీజేయేసీ చేస్తున్న ఓ చిన్న కార్యక్రమాన్ని చూసి ఎందుకు అంతగా కలవరపడుతున్నట్టు..? ఆ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలనే ధోరణిలో ఎందుకు ఆటంకాలు కల్పిస్తున్నట్టు..? అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నట్టు..?
ఇంతవరకూ ఆరు దశల్లో అమర వీరుల స్ఫూర్తి యాత్రను జేయేసీ ఛైర్మన్ కోదండరామ్ చేపట్టారు. వరంగల్ లో ఆరో యాత్రలో భాగంగా పోలీసులు రంగం ప్రవేశం చేయడం, నేతల్ని అరెస్టు చేయడం జరిగింది. అమర వీరుల స్ఫూర్తియాత్రను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ముందుగానే ప్రభుత్వాన్ని కోరితే… ఏవేవో కారణాలు చెప్పి నిరాకరిస్తున్నారంటూ కోదండరామ్ విమర్శిస్తున్నారు. తాము శాంతియుతంగా యాత్ర నిర్వహించుకుంటే కార్యకర్తల్ని అరెస్టు చేసి, మానవ హక్కుల ఉల్లంఘనకు కేసీఆర్ సర్కారు పాల్పడిందని మండిపడ్డారు. సెక్షన్ 151 పేరుతో అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధం అన్నారు. నేరాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన ఒక ప్రకరణను, రాజకీయ కార్యాచరణపై ప్రయోగించడం తప్పు అని కోదండరామ్ అన్నారు. రాజకీయ కార్యాచరణ నేరం కాదు, అది రాజ్యాంగ బద్ధంగా అనుమతి ఉన్న కార్యక్రమం అని చెప్పారు.
నిజానికి, తొలి నాలుగు అమర వీరుల స్ఫూర్తి యాత్రలూ విజయవంతం అయ్యాయి. ఎలాంటి జన సమీకరణ శక్తీ జేయేసీకి లేకున్నా, కోదండరామ్ మాట్లాడితే వినేందుకు చాలామంది ప్రజలు తరలి వచ్చారు. కోదండరామ్ యాత్రపై ప్రధాన మీడియా సంస్థలు కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ, ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకుపోతున్నారు. ఈ యాత్రలకు ఆదరణ పెరుగుతూ ఉండటంతోనే ఐదో యాత్ర నుంచి అడ్డంకులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు! వరంగల్ యాత్రకు వచ్చేసరికి అనుమతుల సమస్య వచ్చింది. ఓ పదిరోజుల ముందే యాత్రకు అనుమతించాలని కోదండరామ్ ప్రభుత్వాన్ని కోరారు. అయినా, అనుమతి ఇవ్వలేదు! దీంతో ఏతావాతా రెండు విషయాలు చర్చనీయం అవుతున్నాయి. కోదండరామ్ బలపడే అవకాశం ఉండటంతో ఈ యాత్రను అడ్డుకుంటున్నారా, లేదా అమరుల స్ఫూర్తి యాత్రకు పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతోందని అనుమతులు ఇవ్వడం లేదా..? గడచిన ఐదు విడతల యాత్ర సమయంలోనూ ఎలాంటి సమస్యలూ లేనప్పుడు ఇప్పుడే ఈ సమస్య ఏంటీ..?