తెలుగుదేశం పార్టీలోకి వలసలు క్రమంగా పెరిగిపోతున్నాయి. టిక్కెట్ పై ఆశ లేని వాళ్లు కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు వస్తున్నారు. ఎలాంటి హామీలు ఉండవని.. పార్టీలో చేరేందుకు వస్తే ఓకేనని చెబుతున్నా వచ్చేస్తున్నారు. రాత్రి ఫోన్ చేసి ఉదయం వచ్చి కండువా కప్పించుకుంటున్నారు. ఏపీలో అన్ని జిల్లాల నుంచి ఇలాంటి చేరికలు కనిపిస్తున్నాయి. టీడీపీ ఆఫీస్ సందడిగా మారుతోంది.
ఇవాళ ఒక్క రోజే దాడి వీరభద్రరావు కుటుంబంతో సహా టీడీపీలో చేరారు. విజయసాయిరెడ్డి బావమరిది .. రాయచోటికి చెందిన ద్వారకనాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరారు. ఆయన గత ఎన్నికకు ముందు కూడా టీడీపీతో చర్చలు జరిపారు. కానీ విజయసాయిరెడ్డి మంతనాలు జరిపి ఆపేశారు. ఈ సారి ఆయన ఎవరి మాట వినలేదు. టీడీపీలో చేరిన తర్వాత.. విజయసాయిరెడ్డిని కూడా టీడీపీలోకి ఆహ్వానించే హక్కు ఉందన్నారు. బహుశా.. ఈ సారి విజయసాయిరెడ్డి కూడా సేఫ్టీ కోసం అయినా తన వాళ్లు అక్కడ ఉండాలన్నట్లుగా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇక ఆశ్చర్యకరంగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా చంద్రబాబుతో కండువా కప్పించుకున్నారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు. తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అక్కడ్నుంచి కాంగ్రెస్, వైసీపీలోకి వెళ్లారు. జగన్ ఎమ్మెల్సీ ఇచ్చారు. అయినప్పటికీ ఆయన టీడీపీలో చేరిపోయారు. ఎలాంటి టిక్కెట్, పదవి ఆఫర్ లేకపోయినా ఆయన పార్టీలో చేరడానికి వచ్చేశారు.
ముందు ముందు టీడీపీలో ఆశ్చర్యకరమైన చేరికలు ఉంటాయని.. భావిస్తున్నారు. ఇక నుంచి ఎన్నికల వరకూ చేరికల ప్రోగ్రాంలు ఎక్కువగా ఉండనున్నట్లుగా తెలుస్తోంది.