హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా చేయాలన్న అంశాన్ని మెల్లగా ప్రజల్లో పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రెండో రాజధాని చేయాలంటే.. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాల్సి ఉంటుంది. తెలంగాణపై కన్నేసిన బీజేపీ.. ఈ దిశగా కొత్త ఆలోచనలు ఏమైనా చేస్తుందేమో కానీ.. హఠాత్తుగా.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు. గవర్నర్ గా పదవి కాలం ముగిసిన తర్వాత సైలెంట్ ఉన్న ఆయన హఠాత్తుగా తెరపైకి వచ్చారు. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్నారు. అంబేద్కర్ కూడా అదే కోరుకున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై పార్టీలన్నీ ఆలోచించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరిగినప్పుడు సీఎం కేసీఆర్ సమక్షంలోనే అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్.. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం అంబేద్కర్ స్వప్నమన్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయలేదు. కానీ అలాంటి ఆలోచన బీజేపీకి ఉందని తర్వాత పరిణామాలతో వెల్లడవుతూ వస్తోంది. ఇప్పుడు విద్యాసాగర్ రావు కూడా ప్రస్తావించారు. ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతోంది. అలాగే రక్షణ పరంగా కూడా హైదరాబాద్ చాలా సేఫ్ అనే నివేదికలు ఉన్నాయి. దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న ఆలోచన కూడా ఉంది.
నిజంగానే బీజేపీ.. రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తామంటే.. స్వాగతించేవారు ఎక్కువగా ఉంటారు. కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తామంటే మాత్రం బీఆర్ఎస్ అంగీకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే తెలంగాణకు ఆదాయ వనరు.. హైదరాబాదే. ఒక వేళ ఇక్కడ బీఆర్ఎస్సే గెలిచినా… ఢిల్లీలోలా పాలన కేంద్రం చేతుల్లో ఉంటుంది. అందుకే.. బీఆర్ఎస్ వ్యతిరేకించే అవకాశం ఉందని భావిస్తున్నారు.