హైదరాబాద్: మున్సిపల్ కార్మికులసమ్మె పదోరోజుకు చేరటంతో భాగ్యనగరం చెత్తనగరంగా మారింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగాకూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు సమ్మె ఉధృతరూపు దాల్చింది. కార్మికులు, కేసీఆర్ ప్రభుత్వం – ఇరుపక్షాలూ పట్టినపట్టు విడవక పోవటంతో పరిస్థితి విషమించింది. అవసరమైతే సైన్యాన్ని దించుతానని ముఖ్యమంత్రి ప్రకటించటంతో సమ్మెచేస్తున్న కార్మికులు మండిపడుతున్నారు. అన్ని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు అడిగినదానికంటే ఎక్కువగా జీతాలు పెంచిన కేసీఆర్కు పారిశుధ్య కార్మికులు అంత లోకువగా కనబడుతున్నారా అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని, చర్చలు జరపకుండా బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కార్మికులకు మద్దతుగా వామపక్షాలు శుక్రవారంనాడు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. దానికి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, మావోయిస్టు పార్టీ, ఎమ్ఆర్పీఎస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. మరోవైపు కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం దిగిరాకుంటే వారికి అండగా తాము సొంతంగా పోరాటం చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇక తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ ఈ సమ్మెపై తర్వాత స్పందిస్తానని అన్నారు.