తెలంగాణలో పబ్‌ల వ్యవహారంలో ఎన్నెన్ని ఆరోపణలు వస్తున్నా కఠిన చర్యలు తీసుకోని కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ పబ్ కేంద్రంగా మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఢిల్లీలోని నిర్భయ తరహా కేసుగా మారుతోంది. 28వ తేదీన జూబ్లిహిల్స్‌లోని ఓ పబ్ నుంచి పదహారేళ్ల అమ్మాయిని కొంత మంది మాయమాటలు చెప్పి బెంజ్ కారులో తీసుకెళ్లారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడి.. రెండు గంటల తర్వాత తీసుకొచ్చి వదిలి పెట్టారు. ఆ పాప తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొదట లైట్ తీసుకున్నారు. కానీ సంచలనం కావడంతో దర్యాప్తు చేయక తప్పలేదు.
అందులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు… ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు సలహా కీలక నేతల కుమారులు ఉన్నట్లుగా తేలింది. దీంతో కేసులు నమోదు చేశారు. పోలీసులు ఏదో కవర్ చేశారు. ఎమ్మెల్యే కొడుకు హస్తం లేదని చెప్పుకొచ్చారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.. కారులో ఆ పిల్లను తీసుకెళ్తూ.. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. వీడియోలు కూడా చిత్రీకరించారు. ఆ వీడియోలను ప్రెస్ మీట్లో రఘునందన్ రావు విడుదల చేశారు. దీంతో సంచలనం ప్రారంభమయింది. ఆ వీడియోల్లో ఎమ్మెల్యే కొడుకు ఉన్నట్లుగా తెలుస్తోంది.
నిజానికి అవన్నీ పోలీసుల వద్ద ఉన్న ఆధారాలే. అవి రఘునందన్ రావుకు ఎలా చేరాయన్నదానిపై పోలీసులు కంగారు పడుతున్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలు కావాలంటే డీజీపీకి ఇస్తానని రఘునందన్ ప్రకటించారు. పోలీసులు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెబుతున్నారు. బెంజ్ కారులో అమ్మాయిపై లైంగిక దాడికి పాల్పడితే.. ఇన్నోవాలో ఉన్నవారిపై కేసులు పెట్టి.. అసలైన వాళ్లను తప్పించాలనుకుంటున్నారని రఘునందన్ అంటున్నారు.
ఈ కేసు విషయంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మీడియాలో సంచలనం అయ్యేదాకా.. విపక్షాలన్నీ ఆందోళన చేసే వరకూ పోలీసులు స్పందించలేదు. అరెస్టులు చేయలేదు. ఆ తర్వాత కూడా కొంత మందిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీలో నిర్బయ తరహాలో ఈ ఘటనపైనా చర్చ జరుగుతోంది.