ఇల్లు కొందామని ప్లాన్లు వేస్తూ.. టైం పాస్ చేస్తున్న వారికి రాను రాను తమ కలను మరింత దూరం చేసుకుంటున్నారు. నాలుగేళ్ల కిందట నలభై లక్షలకు వచ్చిన అపార్టుమెంట్లు, ఇల్లు ఇప్పుడు 70 లక్షలకు చేరాయి. నిజంగా ఇళ్ల కోసం తిరుగుతున్న వారికి ఈ తేడా కనిపిస్తుంది. అలాగే మ్యాజిక్ బ్రిక్స్ సంస్థ చేసిన అధ్యయనంలోనూ ఇదే వెల్లడయింది. హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఊహించనంతగా పెరుగుతున్నాయని.. నాలుగేళ్లలో దాదాపుగా ఎనభై శాతం పెరిగాయని తేల్చింది.
హైదరాబాద్లో ఉండే వారికి ఇది వంద శాతం వాస్తవమేనని స్పష్టంగా తెలుస్తుంది. నిజానికి కొన్ని ఏరియాల్లో రెట్టింపు అయ్యాయి కూడా. కరోనా ముగిసిన వెంటనే చాలా మంది అప్పోసప్పో చేసో ఇల్లు కొనుక్కోవాలని ఆరాటపడ్డారు. మొదట్లో ఓ మాదిరిగా ఉన్న ధరలు.. అక్కడ్నుంచి పెరుగుతూ పోయయాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గర అపార్టుమెంట్లు కూడా యాభై, , అరవై లక్షలకు తక్కువకు రాని విధంగా డిమాండ్ పెరిగింది.
అయితే ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏ మాత్రం మంచిది కాదని.. ప్రజలు సొంత ఇంటి ఆశల్ని చిదిమేసేలా డిమాండ్ పెరిగుతోందని నిపుణుల అంచనా. ఎందుకంటే.. ప్రజల ఆదాయం.. ఆ స్థాయిలో పెరగడం లేదు. కొనుగోలుదారుల ఆదాయంలో అత్యధిక భాగం ఇంటి ఈఎంఐకే చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికైనా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కరెక్షన్ రావాలని సామాన్యులకు ఇళ్లు అందుబాటులోకి రావాలని కోరుకునేవారు ఎక్కువగా ఉన్నారు.