హమ్మయ్య. పెద్దగా ఆలోచించకుండానే ఒక రోజు లైవ్ హడావుడితో గడిచిపోయింది. ఇది మీడియా ఆనందం. మీడియా సమక్షంలో కొన్ని గంటల పాటు లైవ్ లో ప్రసంగాలు, సన్మానాలు చేసే అవకాశం వచ్చింది. ఇది మంత్రుల ఆనందం.
ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన పీవీ సింధుకు హైదరాబాదులో సోమవారం జరిగిన స్వాగత సత్కారం అపూర్వం. అద్భుతం. వేల మంది రోడ్లకు ఇరువైపులా నిలబడి హర్షధ్వానాలు చేస్టుంటే, ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సుపై సింధును ఊరేగించారు.
క్రీడాకారిణిగా సింధు తన వంతు బాధ్యతను నిర్వర్తించింది. వంద కోట్ల మంది ప్రతినిధిగా రియో వెళ్లినందుకు రజత పతకం సాధించింది. అందుకు ఆమెను అభినందించాల్సిందే. అయితే పతకాల కోసం ముఖంవాచిన దేశానికి ఆ ఒక్క రజత పతకమే మహభాగ్యం అయింది. అవకాశం వస్తే అత్యుత్సాహం ప్రదర్శించే మీడియా ఊరుకుంటుందా. ఇంతటి మహదవకాశాన్ని రాజకీయ నాయకులు జార విడుచుకుంటారా?
గచ్చిబౌలి స్టేడియంలో కేవలం సన్మానం మాత్రమే జరగలేదు. అంతకు ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అదేదో రిపబ్లిక్ వేడుకలు జరుగుతున్నాయా అనిపించింది. ఒక్క రజత పతకానికే ప్రభుత్వం, మీడియా ఇంత హడావుడి చేయడం చూస్తే ఒక అనుమానం వస్తుంది. రియోలో 5 స్వర్ణాలతో సహా 6 పతకాలు సాధించిన అమెరికన్ స్విమ్మర్ మైకేల్ ఫెల్ఫ్స్ కు ఏ స్థాయిలో స్వాగత సత్కారాలు జరగాలి? వరసగా మూడు ఒలింపిక్స్ లో 100 మీటర్ల స్వర్ణంతో సహా మొత్తం 9 బంగారు పతకాలు గెల్చుకున్న ఉసేన్ బోల్ట్ ను ఏ రీతిన సత్కరించాలి?
క్రీడాకారులు పతకాలు గెలిచిన తర్వాత నజరానాలు ప్రకటించే ప్రభుత్వాలు, అంతకుముందు వాళ్లను ఏమాత్రం పట్టించుకుంటాయో అందరికీ తెలుసు. సింధును ఓ దేవతలా పొగిడే పనిలో బిజీగా ఉన్న తెలుగు మీడియాకు ఓ విషయం మాత్రం కనిపించలేదు.
రియోలో చివరగా జరిగిన మహిళల మారథాన్ లో భారతీయ అథ్లెట్ జైషా దాదాపు మరణానికి చేరువైంది. 42 కిలోమీటర్ల పరుగులో ఆమెకు కనీసం మంచినీళ్లు ఇవ్వడానికి కూడా భారత్ తరఫున ఏర్పాట్లు జరగలేదు. అధికారులు పత్తా లేరు. మిగతా దేశాల వారి కోసం వాళ్ల వాళ్ల అధికారులు ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చోట మంచినీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేశారు.
మండే ఎండలో, దాహంతో అంత దూరం ఓపిగ్గా పరుగెత్తిన జైషా, స్టేడియంల్ ఫినిషింగ్ లైన్ దాటగానే కుప్పకూలి పోయింది. ఆమె చనిపోయిందని అనుకున్నారు. చివరకు ఆమె కోచ్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి బతికించాడు. మన మీడియాను ఈ వార్త ఆకర్షించలేదు. రేపు ఏపీలో సింధు స్వాగత సత్కార షోను కూడా తెలుగు మీడియా బాగానే రక్తి కట్టిస్తుంది. లైవ్ లో తన ఘనతను సుదీర్ఘంగా చాటుకోవడానికి చంద్రబాబుకు మరో అవకాశం.