హైదరాబాద్ లో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ కట్టడమా..? లేదా ? అని డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం ఎలాంటి ఆలస్యం లేకుండా రంగంలోకి దిగిపోతోంది.
తాజాగా శుక్రవారం ఉదయం హైదరాబాద్ రామ్ నగర్ మణెమ్మ కాలనీలో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. నాలాను ఆక్రమించి నిర్మాణం చేపట్టారని తేలడంతో కూల్చివేతలు చేపట్టింది. రెండు రోజుల కిందటే అక్కడికి చేరుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఆ నిర్మాణం పై నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నివేదికలో నిర్మాణాలు అక్రమేనని తేలడంతో హైడ్రా అధికారులు వాటిని కూల్చివేశారు.
విక్రమ్ యాదవ్ కు చెందిన స్థలంలో కల్లు కంపౌండ్ కొనసాగుతుందని, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని.. దీని ద్వారా స్థానికులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన యంత్రాంగం..శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకొని కల్లు పారబోసి..కూల్చివేతలు మొదలు పెట్టింది.
ఫిర్యాదు అందగానే.. ఆలస్యం లేకుండా హైడ్రా కూల్చివేతలు చేపట్టడంపై హర్షం వ్యక్తమవుతోంది.