భారత యుద్ధ విమానం మిగ్ -21 ఫైటర్ పైలట్ పాకిస్థాన్ దళాలకు పట్టుబడ్డారు. పాకిస్తాన్ భూభాగంలో కూల్చేసిన విమానంలో ఉన్న పైలట్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు. తన పేరు విక్రమ్ అభినందన్ అని.. తను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గా విధులు నిర్వహిస్తున్నట్లుగా ఆ పైలట్ చెప్పారు. దీనికి సంబంధించినదిగా చెబుతున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయింది. కొద్దిసేపటి కిందట మీడియా సమావేశం నిర్వహించిన భారత విదేశాంగ శాక.. ఓ వింగ్ కమాండర్ తప్పిపోయినట్లు అంగీకరించారు.
పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సైనిక స్థావరాలపై దాడులు చేశాయని.. ఆ సమయంలో… ఆ విమానాలను తరిమికొట్టడానికి మిగ్ -21 విమానం వెళ్లిందన్నారు. ఆ ప్రయత్నంలో.. పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి వేసినప్పటికీ.. భారత ఫైటర్ జెట్ ను కోల్పోయామన్నారు. ఆ ఫైటర్ జెట్ వింగ్ కమాండర్ ఆచూకీ తెలియడం లేదన్నారు. పాకిస్థాన్ తమ అధీనంలో ఓ వింగ్ కమాండర్ ఉన్నారని చెబుతోందన్నారు. ఉదయం పాక్ యుద్ధవిమానాలను వెంటాడుతూ నియంత్రణ రేఖను దాటిన రెండు భారత వాయుసేనకు చెందిన యుద్ధవిమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ ప్రకటించుకుంది. వీటిలో ఒక విమానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్లో కూల్చేయగా.. మరో విమానాన్ని కశ్మీర్లో కూల్చివేసినట్లు పేర్కొన్నారు. మరో వైపు దేశంలో…పలు విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ సరిహద్దు ప్రాంతాలకు విమానాల రాకపోకలను నిలిపివేశారు. పాకిస్తాన్ కు సమీపంలో ఉన్న విమానాశ్రయాలను మూసివేశారు. పాకిస్తాన్ లోనూ అదే పరిస్థితి. అక్కడ జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలను ఆపేశారు. యుద్ధానికి తాము సిద్ధమయ్యాని పాకిస్తాన్ చెబుతోంది. మరో వైపు భారత ప్రభుత్వం కూడా.. సర్వసన్నద్దంగా ఉంది. కశ్మీర్ కేంద్రంగా.. భారత్ – పాకిస్తాన్ యుద్ధమేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి.
పుల్వామా ఘటనపై పూర్తి స్ధాయి దర్యాప్తునకు సహకరిస్తామని చెప్పినప్పటికీ..భారత్ దుందుడుకు చర్యలకు దిగిందని.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయే కుటుంబాల బాధలను తాను చూశానన్నారు. భారత్ యుద్ధానికి సిద్ధమైతే… జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదని హెచ్చరించారు. ఒక సారి వార్ ప్రారంభమైతే.. మోడీ చేతుల్లో కానీ..తన చేతుల్లో కానీ ఏమీ ఉండదన్నారు.