తెలంగాణ ఎన్నికల్లో అమరావతి కూడా ప్రధాన ఇష్యూ అయిపోతోంది. బీఆర్ఎస్ మళ్లీ రాకపోతే.. హైదరాబాద్ కూడా అమరావతిలా అయిపోతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరించడం ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టుపక్కల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న హరీష్ రావు.. మెల్లగా ఏపీతో పోలికలు పెట్టడం ప్రారంభించారు. బీఆర్ఎస్ రాకపోతే ఏపీ రాజధాని లాగా హైదరాబాద్ అవుతుందని వ్యాపారులు అంటున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. అంటే హరీష్ రావు ఉద్దేశం.. అమరావతి లాగా హైదరాబాద్ ను కూడా నిర్వీర్యం చేస్తారనే. అమరావతిపై బీఆర్ఎస్ నేతలు గతంలో చాలా కామెంట్లు చేశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒకే సారి యాభై వేల కోట్ల రూపాయల పనులు జరిగేవి. అయితే వాటిని ఆపేయడంతో పెట్టుబడులన్నీ హైదరాబాద్ కు తరలాయి. దాంతో.. హైదరాబాద్ ఊహించనతంగా విస్తరించింది. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ రాకపోతే.. హైదరాబాద్ లో ్భివృద్ధి ఆగిపోతుందని.. హరీష్ రావు ప్రచారం ప్రారంభించారు. సరైన పాలకుడు లేకపోతే అమరావతి లాగే.. ఏపీ లాగే అవస్థలు పడాల్సి వస్తుందని.. హరీష్ రావు, కేటీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. ఏపీ ప్రజలు ఏం కోల్పోయారో.. తెలంగాణలో ఉన్న వారికి.. తెలంగాణ పాలకులకు తెలుసు.
అందుకే.. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ఓటర్లకు .. నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. ఏపీని ఇలా వినాశనానికి ప్రతి రూపంలో చూపిస్తున్నా.. ఏపీ ప్రజలకు అర్థమవుతుందో లేదో కానీ.. ఎన్నికల సమయంలో ఎలాంటి పాలకులు రాకూడదో చెప్పడానికి.. ఇతరులకు ఓ ఉదాహరణగా మాత్రం ఉపయోగపడుతోంది.