కోమట్లలో కాక పుట్టించిన కంచె ఐలయ్య పుస్తకం దాని కధ కమామీషు ఇప్పుడప్పుడే కంచికి చేరేలా లేదు. సదరు పుస్తకంపై రగిలిన రగడ, వైశ్యుల, వైశ్య ప్రజాప్రతినిధుల, మీడియా ఓవరాక్షన్ పుణ్యమాని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పరిచయమైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య… రెట్టించిన ఉత్సాహంతో ఊగిపోతున్నాడు. అచ్చమైన రాజకీయనేతల తరహాలో దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రికే సవాల్ విసిరేస్తున్నాడు.
తన పుస్తకం మీద పుట్టిన గొడవను సామాజిక సమస్యగా మార్చి, తమ సామాజిక వర్గాల మద్ధతును చెప్పుకోదగ్గ స్థాయిలోనే కూడగట్టగలుగుతున్న ఐలయ్య… అదే ఊపులో్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన విజయవాడలో శనివారం బహిరంగ సభ నిర్వహించనున్నాడు. సామాజిక జన సభ పేరిట ఆయన తరపున తలపెట్టిన ఈ బహిరంగ సభకు ప్రభుత్వం తొలుత అనుమతించినప్పటికీ… ఇప్పుడు రకరకాల నిషేధాజ్ఞలు విధిస్తోందంటూ కంచె ఐలయ్య గురువారం మండిపడ్డాడు.
ఈ నెల 9వ తేదీనే తమ సభకు ప్రభుత్వం అన్ని అనుమతులూ ఇచ్చిందని, ఇప్పుడు 144 సెక్షన్ విధించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్న ఐలయ్య… ఏదేమైనా సభ జరిపే తీరుతామంటూ స్పష్టం చేశాడు. తమ బస్సు హైదరాబాద్లో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి విజయవాడకు చేరుకుంటుందని మధ్యాహ్నం 2గంటల నుంచి జింఖానా మైదానంలో సభ ప్రారంభం అవుతుందని చెప్పాడు. ఈ సభను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు. తనను అరెస్ట్ చేస్తే… ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే ఉన్న ఈ సమస్య ప్రపంచస్థాయి సమస్యగా మారుతుందంటూ నిప్పులు చెరిగాడు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ నేరుగా ముఖ్యమంత్రికే సవాల్ విసిరాడు.
ఇదిలా ఉంటే… ఐలయ్య సభకు పోటీగా విజయవాడలో వైశ్యులు ఏకమవుతున్నారు. కయ్యానికి కాలు దువ్వుతున్నారు సామాజికంగా చూస్తే విజయవాడ వైశ్య కులానికి గట్టి బలమున్న ప్రాంతం కావడంతో శనివారం ఏం జరగబోతోందోననే ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. కులాల మధ్య కుమ్ములాటగా మారిన ఈ అంశాన్ని సరిగా డీల్ చేయకపోతే రాజకీయంగా భవిష్యత్తులో ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో సిఎం చంద్రబాబు ఎలాంటి వైఖరి తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.