ప్రొఫెసర్ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమిటోళ్లు అనే పుస్తకంపై వివాదం ఒక కొలిక్కి వచ్చినట్టే చెప్పాలి. ఆయనకూ ఆర్యవైశ్య సంఘాలకూ మద్య రాజీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో రెండు ధోరణులు వున్నాయి.ఆయన పెట్టిన శీర్షిక సరిగా లేదనీ, ఆ పరిశీలనా పద్ధతి కూడా సమగ్రంగా లేదని నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా వైశ్యులపట్ల ఐలయ్య అధ్యయనంలో లోపాలు ఎత్తిచూపారు. వాటిపై కొంత మంది కావాలని వ్యాఖ్యలు చేసినా మొత్తంపైన రెండో అభిప్రాయం రావడాన్ని ఎక్కువ మంది హర్షించారు. అదే సమయంలో కొన్ని లోపాలున్నంత మాత్రాన శీర్షిక నచ్చనంత మాత్రాన ఐలయ్యపై దాడులు పుస్తకం నిషేదం నినాదాలు సరికాదని కూడా మేము గట్టిగా చెప్పాము. తాజాగా సిపిఎం నాయకులు బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం కూడా సామాజిక స్మగ్లర్లు అన్న శీర్షిక సరిగా లేదని స్పష్టం చేశారు. కులాల పరిణామంలో వచ్చిన మార్పులను కూడా లోతుగా అధ్యయనం చేయాలని రాఘవులు పేర్కొన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాటంలోనూ లాల్ నీల్ విధానంలోనూ ముఖ్య సూత్రధారిగా వున్న రాఘవులు వ్యాఖ్యలు ఒకవైపు, ఐలయ్యకు రక్షణగా నిలిచిన టిమాస్ వేదికకు ఒక మూల స్తంభంగా వున్న తమ్మినేని వీరభద్రం చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఐలయ్యపై దాడులను ఖండించాలని వారు గట్టిగా చెప్పారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా గృహానికే పరిమితమైన ఐలయ్య ఈ రోజు బయిటకు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో సభలో పాల్గొన్నారు. మరోవైపున ఆర్యవైశ్య మహాసభల్లో రోశయ్య, టిజి వెంకటేశ్ వంటి వారు తమ తమ పాతధోరణులను పునరుద్గాటించారు. అయతే గతంలోని ఉద్రిక్తత నెమ్మదిగా తగ్గుముఖం పట్టేసూచనలున్నాయి. ఈ విషయంలో చాలా తీవ్రంగా వాదించిన పరిపూర్ణానంద స్వామి కూడా అయోధ్య వెళ్లిపోయారు. నిరసనలు సమర్థనలు మరికొంంత కాలం నడిచినాతీవ్ర పరిణామాలు వుండవనే అనిపిస్తుంది.