చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల్ని తప్పుడు కేసుల్లో ఇరికించడానికి కొల్లి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ చేసిన క్రూరమైన పనులు ఒక్కొక్కటిగా బయటపడుతూండటంతో అధికారవర్గాల్లో ఆయన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన ఐఏఎస్ ఆఫీసర్లను సైతం తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తామని వేధించారు. ఈ వివరాలన్నీ మెల్లగా బయటకు వస్తున్నాయి. ఏదైనా నేరం జరిగితే కేసులు పెట్టి అరెస్టు చేయడం వేరు..కానీ నేరం జరగకుండానే ఏదో జరిగిందని స్టేట్మెంట్ తీసుకునేందుకు కూడా బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.
ఐఏఎస్ శ్రీధర్‌తో పాటు ఇతరులపై ఘోరాలు
చంద్రబాబు హయాంలో కీలకంగా పని చేసిన ఐఏఎస్ శ్రీధర్ తో పాటు మరో ఐఏఎస్ అధికారితో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చి సంతకం చేయించుకున్నారు. అందు కోసం వారు నిరాకరిస్తే వారిపైనా తప్పుడు కేసులు పెట్టించారు. తప్పుడు మెయిల్స్.. రికార్డులు సృష్టించారు. తాము ఈ పని చేస్తే.. రేపు వచ్చే ప్రభుత్వంలో తామే నిండా మునిగిపోతామన్న సంగతిని మర్చిపోయారు. జగన్ రెడ్డి చెప్పింది చేయడానికి చంద్రబాబును ఇరికించడానికి వారు ఎంత ఘోరాలకు పాల్పడ్డారో ఇప్పుడు ఆధారాలతో సహా స్పష్టమవుతోంది
శవాలను కూడా తెచ్చి వాడేసిన కొల్లి రఘురామిరెడ్డి
కొల్లి రఘురామిరెడ్డి శవాలను కూడా వదల్లేదు. స్కిల్ కేసులో సిమెన్స్ మాజీ ఉన్నత ఉద్యోగి సుమన్ బోస్ తో చంద్రబాబుకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇప్పించేందుకు ఆయనను తీసుకొచ్చి ఆయన పక్కన శవాన్నిపెట్టి హింసించారు. అప్పటికీ ఆయన తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వలేదు. అయినా అతకని వివరాలు… సగం సగం వివరాలతో చంద్రబాబును అరెస్టు చేశారు. ఈ కొల్లి రఘురామిరెడ్డినే చంద్రబాబును అరెస్టు చేశారు. ఇవి బయటకు వచ్చినా అరాచకాలే.. రాజధాని కేసుల పేరుతో ఆయన చేసిన అధికార దుర్వినియోగం అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
కొల్లి రఘురామిరెడ్డి ఐపీఎస్ సర్వీస్‌కు అనర్హుడు !
జగన్ రెడ్డి కోసం… తన పవర్ ను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి తప్పుడు సాక్ష్యాలను కూడా సృష్టించే ప్రయత్నం చేసిన కొల్లి రఘురామిరెడ్డి నిర్వాకాలపై పూర్తి స్థాయి నివేదిక రెడీ అవుతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులతో కలిసి కొల్లి రఘురామిరెడ్డి చేసిన వ్యవహారాలు మొత్తం బయటకు రాబోతున్నాయని చెబుతున్నారు. అనధికారికంగా నాటి సీజేఐ కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలు సేకరించడం దగ్గర్నుంచి చంద్రబాబు కుటుంబసభ్యుల వివరాలు కూడా అక్రమంగా సేకరించడం వరకూ చాలా అంశాలు సిట్ చేసింది. అన్నీ బయట పెట్టి ఆయనను సర్వీస్ నుంచి తొలగించేలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. కేసులు అదనంగా ఆయన జీవితాంతం వెంటాడనున్నాయి.