ఇల్లు అయినా, స్థలం అయినా జీవిత కాల కష్టం. అందుకే కొనుగోలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆస్తులు కొనేటప్పుడు నేరుగా డీల్స్ పెట్టుకోవడం కష్టం. మధ్యవర్తులు ఉంటారు. ఇప్పుడు మధ్యవర్తులుగా కంపెనీలు వచ్చేశాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఏజెంట్లు, బిల్డర్లు, రియల్టీ డెవలపర్లు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. కానీ కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలి.
ఇల్లు లేదా స్థలం తీసుకునేటప్పుడు ముందు మన అవసరం ఏమిటో గుర్తించాలి. మనం పెట్టుబడి రూపంలో పెడుతున్నామా… లేకపోతే ఉండటానికా అన్నది తెలుసుకోవాలి. తర్వాత రిటర్న్స్ గురించి ఆలోచించాలి. జీవిత కాలం సంపాదన పెడున్నామంటే దానికి రిటర్న్స్ ఖచ్చితంగా ఉండాలి. తక్కువకు వస్తున్నాయని పట్టణానికి కొంచెం దూరంగా తీసుకుంటే రిటర్న్స్ రావడం ఆలస్యం అవుతుంది. ఒక వేళ ఉండటానికి ఇల్లు తీసుకోవాలనుకుంటే.. పని చేస్తున్న ప్రదేశానికి కొంటున్న ఇల్లు ఎంత దూరంలో ఉందన్నది చూసుకోవాలి. తక్కువ ధరకు వస్తుంది కదా అని దూరంలో కొనుగోలు చేస్తే ప్రతీ దానికి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది.
అలాగే అపార్టుమెంట్లకు విలువ అనుకున్న స్థాయిలో పెరగదు. కొన్ని చోట్ల తగ్గుతుంది కూడా. కొనే ముందు అక్కడ ధరల తీరుతెన్నుల గురించి విచారణ చేసుకోవాలి .మీరు ఇల్లు ఏ ప్రాంతంలో అయితే కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారో… ఆ ప్రాంతంలో అద్దెలు ఎలా ఉన్నాయో విచారించండి. అధిక జనాభా ఉండే ప్రాంతంలో అద్దెల ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇల్లు లేదా స్థలం కొనే ముందు చూడాల్సింది.. అవసరాలు… ఆస్తుల విలువ… అందుబాటులో ఉండటం.