ఏడాదిలో నాలుగు వేల కోర్టు ధిక్కరణ కేసులు. అంటే.. కోర్టు ఇచ్చిన తీర్పును కూడా పాటించకపోవడం వల్ల దాఖలైన కేసులు. ఇంకా అమలుచేస్తారని ఆశతో .. తిరుగుతున్న వారు వేరే ఉంటారు. ఆశ చచ్చిపోయి కోర్టుకొచ్చిన కేసులు అవి. ఇన్ని పిటిషన్లు ఎందుకు పడుతున్నాయి ? కోర్టు ఆదేశించినా ఎందుకు అమలు చేయడం లేదు ? అని.. స్వయంగా న్యాయస్థానం కూడా ఆశ్చర్యపోతోంది. ఇదేం తీరు అని ఐఏఎస్ అధికారులను ప్రశ్నిస్తోంది. కానీ వారు మాత్రం నీళ్లు నములుతున్నారు. కోర్టు ధిక్కరణ కేసు విచారణ ఉందనగా.. ఒకటి, రెండు రోజుల ముందు బాధితుల అకౌంట్లలో డబ్బు జమ చేసి వచ్చి .. చెల్లించామని చెబుతున్నారు. విచారణకు రాకపోతే పట్టించుకోవడం లేదు.
ఏపీలో పాలన రాజ్యాంగ బద్దంగా సాగుతుందా లేదా అన్నదానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. న్యాయవ్యవస్థను అసలు లెక్క చేయడం లేదు. కోర్టు ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం పాటించడం లేదు. ఆ తీర్పు నచ్చకపోతే అప్పీల్‌కూ వెళ్లడం లేదు. అలాగని అమలు చేయడం లేదు. న్యాయం కోసం కోర్టుకెళ్లి ఖర్చులు పెట్టుకుని పోరాడి.. న్యాయం దక్కించుకున్న వారు ప్రభుత్వం వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రభుత్వం న్యాయస్థానం ఉత్తర్వులకు కనీస గౌరవం ఇవ్వకపోవడమే దీనికి కారణం.
ఏపీ ప్రభుత్వం కావాలని చేస్తుందో ..మరో కారణమో కానీ.. ప్రభుత్వం కోసం పనులు చేసిన వారెవరికీ పైసా చెల్లించడం లేదు. డబ్బుల కోసం వారు కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది. ఇలా దాఖలవుతున్న పిటిషన్లే వేల కొద్దీ ఉంటున్నాయి . ఎప్పటికప్పుడు హైకోర్టు డబ్బులు చెల్లించాలని ఆదేశిస్తోంది. కానీ కోర్టు ధిక్కరణ పిటిషన్లు విచారణకు వచ్చే వరకూ చెల్లించడం లేదు. అది ఎంత చిన్నమొత్తమైనా సరే అంతే. దీంతో కోర్టు ముందు ఐఏఎస్ అధికారులు దోషులుగా నిలబడాల్సి వస్తోంది. చాలా సార్లు శిక్షలు కూడా విధించారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. కోర్టుకు రావడం తమ ప్రివిలేజ్ అన్నట్లుగా ఆ ఐఏఎస్‌లు ఫీలవుతున్నట్లుగా ఉన్నారు కానీ.. తప్పు చేశామని అనుకోవడం లేదు.
అధికారుల గౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు.. వారిని బోనెక్కించడానికే ఆసక్తి చూపిస్తోంది. ఏపీ సీఎస్, డీజీపీ సహా అందరూ అసహజ కారణాలతో .. ప్రభుత్వ నిర్వాకం కారణంగా బోనెక్కుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆ అధికారుల్లో కనీస మార్పు రావడం లేదు. అన్నీ వదిలేశారని.. ఐఏఎస్‌లుగా సంపాదించుకున్న గౌరవం పోయినా వారికేమీ పట్టడం లేదన్న అభిప్రాయం సామాన్యుల్లో ఏర్పడుతోంది.