వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది. ఇప్పుడు ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. ఆయన ఎటు వైపు అడుగు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వంగవీటి రంగా వారసునిగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయన మొదట వైఎస్ హయాంలో 2004లో విజయవాడ ఈస్ట్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. విజయవాడ సిటీలో మూడు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. ఆ తర్వతా ఆయన పీఆర్పీలో చేరారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేశారు. కానీ గెలుపొందలేకపోయారు. పీఆర్పీ .. కాంగ్రెస్‌లో విలీనం కావడం.. తదనంతర పరిణామాలతో.. ఆయన జగన్ పంచన చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు జగన్… విజయవాడ తూర్పు టిక్కెట్ కేటాయించారు. కానీ… అక్కడా విజయం సాధించలేకపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనను… విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పని చేసుకోవాలని జగన్ సూచించడంతో.. అక్కడ రాజకీయాలు చేశారు. చివరి క్షణంలో కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణును పార్టీలోకి తీసుకొచ్చి.. ఇన్చార్జ్ పదవి ఇవ్వడమే కాదు.. టిక్కెట్ కూడా ఆయనకేనని జగన్ ఏకపక్షంగా ప్రకటించడంతో.. వంగవీటి రాధా మనస్థాపానికి గురయ్యారు.
నిజానికి వంగవీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి.. చాలా అవమానకరంగా వ్యవహరించారని.. వైసీపీలో ప్రచారం జరిగింది. మొదట్లో వైసీపీ నేత గౌతం రెడ్డి .. వంగవీటి రంగాను.. పాముతో పోల్చారు. ఆ సమయంలో.. చాలా వివాదం అయింది. అయితే.. గౌతంరెడ్డిపై తూతూ మంత్రంగా సస్పెన్షన్ వేసిన జగన్.. ఆ తర్వాత దాన్ని కూడా ఎత్తేశారు. ఆ తర్వాత నుంచి కూడా.. రాధాకృష్ణకు.. పార్టీలో ప్రాధాన్యం దక్కలేదు. డివిజన్ల అధ్యక్షులుగా ఉన్న రాధాకృష్ణ వర్గీయులను ఒక్కొక్కరిని తొలగించారు. చివరికి వంగవీటి టిక్కెట్‌కే ఎసరు పెట్టారు. టిక్కెట్ లేదని చెప్పే ముందు జగన్మోహన్ రెడ్డి ఒక్క సారి కూడా వంగవీటితో మాట్లాడలేదు. ఇతర పార్టీ నేతల్ని పంపించారు. విజయసాయిరెడ్డి, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి నేతల్ని పంపించి.. రక రకాల ప్రతిపాదనల్ని పెట్టారు కానీ… ఒక్క సారి కూడా జగన్ హామీ ఇవ్వలేదు. విజయవాడ తూర్పు, మచిలీపట్నం పార్లమెంట్ అని ఆశ పెట్టారు కానీ.. ఏదీ సాధ్యం కాలేదు. ఆ రెండు స్థానాలను యలమంచిలి రవి, వల్లభనేని బాలశౌరిలకు కేటాయించారు. వారు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసుకుంటున్నారు.
ఈ దెబ్బతో.. వంగవీటి.. తన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడిందని గుర్తించి.. పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఆయన భవిష్యత్‌పై ఇప్పటికీ.. ఎలాంటి క్లారిటీ లేదు. జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. వంగవీటి వర్గీయులకు దీనిపై ఎలాంటి క్లూ లేదు. పీఆర్పీ తరపున పోటీ చేసిన సమయంలో… పవన్ కల్యాణ్ ప్రచారానికి వస్తారని.. మాటిచ్చి రాకపోవడం వల్లే తాను స్వల్ప తేడాతో ఓడిపోయానని… వంగవీటి అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రాజకీయాలు మారాయి.. కాబట్టి… జనసేనలో చేరినా ఆశ్చర్యం లేదు. వంగవీటికి విజయవాడలో సీటు సర్దుబాటు చేయడానికి చాన్స్ లేదు. అన్ని టీడీపీ సిట్టింగ్ స్థానాలే. వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఒక వేళ రాధాకృష్ణ టీడీపీ వైపు మొగ్గు చూపితే.. మాత్రం… కృష్ణా జిల్లాలో ఏదో ఓ స్థానం కచ్చితంగా సర్దుబాటు చేయడానికి టీడీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తుంది. మరి వంగవీటి దారి ఎటు ఉంటుందో..?