ఏపీలో విమానాశ్రయాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 7 విమానాశ్రయాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేయటంతో పాటు ఆ సంఖ్యను 14కు పెంచేలా సీఎం చంద్రబాబు కార్యాచరణ చేపట్టగా… అందుకు తనవంతు కృషి చేస్తానని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న రాజమండ్రి, కడప, విజయవాడ ఎయిర్ పోర్టుల్లో టెర్మినల్ సామర్థ్యాల పెంపుపై సీఎం చంద్రబాబు కేంద్రమంత్రితో మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం… స్వయంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయానికి వెళ్లారు. అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాల్సిన సహకారం… విమానయాన శాఖ నుండి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఇక, ఏపీలో కొత్తగా శ్రీకాకుళం, దగదర్తి, కుప్పంతో పాటు నాగార్జున సాగర్ లో కొత్తగా విమానశ్రయాలకు అనువుగా గుర్తించామని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వీటిని అభివృద్ది చేసే అంశంపై ముందుకు వెళ్లబోతున్నట్లు కేంద్రమంత్రి అధికారికంగా ప్రకటించారు.
ఇక పుట్టపర్తిలో ఉన్న ప్రైవేటు విమానాశ్రయాన్ని ప్రభుత్వం తరపున ఆపరేట్ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించామని, అది కేంద్ర పౌరవిమానయాన శాఖకు అప్పగిస్తే సాధారణ సేవలకు అవకాశం ఉంటుందని అధికారులు వివరించారు. ఏపీని లాజిస్టిక్ హబ్ గా నిలబెట్టాలన్న పట్టుదలతో సీఎం ఉన్నారని, అందుకు తమ శాఖ కీలకం కానుందని… ఇందులో తన వంతు తోడ్పాటు అందిస్తానని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.