కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి, ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఇండియా కూటమిలు వ్యూహాలు రచిస్తున్నాయి. అటు కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమికైనా, ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికైనా యూపీ రాష్ట్రంలోని లోక్ సభ స్థానాలు కీలకం అనేది ఓపెన్ సీక్రెట్. 80 సీట్లున్న ఇక్కడి నుంచి 2019లో బీజేపీ 62స్థానాలు గెలుచుకొని కేంద్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. అయితే, ఇప్పుడు రాజకీయ పరిణామాలు మారాయని ఇండియా కూటమి చెబుతోంది. వారాణాసి మినహా 79సీట్లు గెలవబోతున్నామని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటిస్తున్నారు.
అఖిలేష్ ధీమా ఏంటని చర్చ జరుగుతుండగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సుల్తాన్ పూర్ జిల్లాకు చెందిన ప్రముఖ నేత చంద్రభద్ర సింగ్ ను ఎస్పీలో చేర్చుకొని బీజేపీకి హెచ్చరికలు పంపారు అఖిలేష్ యాదవ్. యూపీలో బలమైన ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన చంద్రభద్ర సింగ్ ఈ నియోజకవర్గంతో పాటు కొన్ని సెగ్మెంట్లలో ప్రభావం ప్రదర్శించగలరు. గత ఎన్నికల్లో సుల్తాన్పూర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీకి గట్టిపోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మేనకా గాంధీ కేవలం 14,526 ఓట్ల తేడాతో గెలిచారు. ఆమెకు 4,59,196 ఓట్లు రాగా, చంద్రభద్రకు 4,44,670 ఓట్లు వచ్చాయి.
మరోసారి సుల్తాన్పూర్ బీజేపీ నుంచి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థిగా రామ్భూల్ నిషాద్ బరిలో నిలిచారు. అయితే, మేనకాగాంధీని ఎస్పీ ఓడించే పరిస్థితి లేదని ఇటీవల విశ్లేషణలు వ్యక్తం అవుతుండగా తాజాగా సుల్తాన్ పూర్ జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపగల చంద్రభద్ర సింగ్ ఎస్పీలో చేరడంతో లెక్కలు మారే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ నియోజకవర్గానికి మే25న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో చంద్రభద్ర సింగ్ ఎస్పీలో చేరడంతో బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ తప్పదని స్పష్టం అవుతోంది.
అంతేకాదు, ఆయన ప్రభావం మరికొన్ని లోక్ సభ సెగ్మెంట్లపై కూడా ఉండటంతో పాటు, ప్రభుత్వంపై వ్యతిరేకత వెరసి అఖిలేష్ చెప్పినట్టుగా కాకపోయినా యూపీలో ఇండియా కూటమి డబుల్ డిజిట్ స్థానాలను గెలుస్తుందా..? అనే చర్చ ప్రారంభమైంది.