దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఈ కార్యక్రమంలో తొలిరోజు దాదాపు 3లక్షల మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి టీకా ఇస్తారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 2934 కేంద్రాల్లో ఈ టీకాలను అందించనున్నారు. ప్రతి కేంద్రంలో వంద మందికి టీకాలు ఇచ్చే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. నరేంద్రమోడీ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ గా మాట్లాడి… టీకాలు ఇచ్చే సిబ్బందితో..టీకాలు ఇచ్చే వారితో మాట్లాడతారు.
ప్రస్తుతానికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను అన్ని చోట్లకు పంపిణీ చేశారు. వీటిలో ఏ టీకా తీసుకోవాలనే ఆప్షన్ ప్రస్తుతానికి ఆరోగ్య కార్యకర్తలకు లేదు. ఇచ్చింది తీసుకోవాలి. కోవాగ్జిన్ తీసుకునే ఆరోగ్య కార్యకర్తల వద్ద డిక్లరేషన్ తీసుకుంటారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు ఎలాంటి నిబంధనలు లేవు. మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకపోవడంతోనే కోవాగ్జిన్ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో కోటి మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించగా. కోటి 65 లక్షల డోసులను ప్రభుత్వం సేకరించింది. . వీటిలో కోటి పది లక్షల డోసులు కొవిషీల్డ్‌వి కాగా, మరో 55లక్షల డోసులను కొవాగ్జిన్ నుంచి తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్‌ను రెండు డోసులను 28రోజుల వ్యవధిలో ఇస్తారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న 14రోజుల తర్వాతే టీకాల ప్రభావం వల్ల యాంటీబాడీలు పెరుగుతాయి. అప్పటి వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 16వ తేదీ వరకు రిజిస్టర్ అయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్టులు ఏమైనా ఉంటాయేమో పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.