ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధమే అన్నంత షో చేశారు. మౌకా ..మౌకా యాడ్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో భావోద్వేగాలను పెంచారు. అయితే మ్యాచ్ మాత్రం సాదాసీదాగా అయిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్ల ముందు కోహ్లీ టీం తేలిపోయింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ మధ్య దేంట్లోనూ పాక్ ప్రమాణాలను అందుకోలేకపోయారు. క్రికెట్ చూడటం మానేసినచాలా మంది కూడా ఆదివారం టీవీల ముందు కూర్చున్నారు. కానీ తొలి ఓవర్లలోనే వారికి సీన్ అర్థమైపోయింది. ఏదో ఆశతో చివరి వరకూ చూసి ఉంటారు కానీ టీమిండియాపై ఎవరూ ఏ దశలోనూ ఆశలు పెట్టుకోలేదు.
ఆఫ్రిది పేరు వింటే అందరికీ ఓ స్టార్ బ్యాట్స్ మెన్ గుర్తుకు వస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంకో ఆఫ్రిది బుల్లెట్ల లాంటి బంతులతో దడ పుట్టించాడు. ఇతని ఆట తీరు మెచ్చే తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసి.. అల్లుడ్ని చేసుకోవాలని ఆ ఆఫ్రిది కూడా నిర్ణయించుకున్నారు. ఇతర ఆటగాళ్లు కూడా ఏ మాత్రం తగ్గలేదు. కెప్టెన్ బాబర్ అజామ్ తన టాలెంట్ అంతా చూపించారు. ఇక్కడ జరిగిందేమిటంటే… పాకిస్తాన్ ఆటగాళ్లు ఏ దశలోనూ ఒత్తిడికి గురయినట్లుగా కనిపించలేదు. వాటి ఆట వారు ఆడారు.
కానీ ఇండియా ఆటగాళ్లకు ఆట ఎప్పుడో మారిపోయింది. అయితే ఐపీఎల్..లేకపోతే టూర్లు అన్నట్లుగా సాగిపోతుంది. ప్రతీ మ్యాచ్ వారికి ఓ రొటీన్ మ్యాచ్‌లాగే అయిపోయింది. ఇది ప్రత్యేకం అని టీం ఇండియా మెంబర్స్ ఎప్పుడైనా అనుకుంటే అది ఓటమికి దారి తీస్తోంది. ఆ ప్రభావం.. దుబాయ్‌లో స్పష్టం గా కనిపించింది. వరల్డ్ కప్‌లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ వస్తే కప్పు గెలవకపోయినా పర్వాలేదు.. మ్యాచ్ గెలవాలని రెండు దేశాల్లో క్రికెట్ అభిమానులు అనుకుంటారు. ఆ రకంగా పాకిస్తాన్ కప్పు గెలిచినట్లే. ప్రపంచకప్‌లో ఐదు సార్లు పాకిస్తాన్‌ను ఓడించించిన ఇండియా టీంకు ఈ సారి అదృష్టం కలసి రాలేదు.