ఐ.టి. ఔట్ సోర్సింగ్ లో దూసుకుపోతున్న భారతీయ కంపెనీలకు ఓ స్పీడ్ బ్రేకర్ ఎదురు కాబోతుంది. మన కంపెనీల జోరుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా అమెరికా ఓ ప్రత్యేక చట్టాన్ని చేయడానికి రంగం సిద్ధం చేసింది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో ఇద్దరు సభ్యులు ఓ బిల్లును ప్రవేశపెట్టారు.
డెమొక్రటిక్ పార్టీకి చెందిన బిల్ పాస్క్రెల్ (న్యూ జెర్సీ), రిపబ్లికన్ పార్టీకి చెందిన డానా రోహ్రాబాచర్ (కాలిఫోర్నియా) ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారతీయ కంపెనీలు హెచ్ 1బి, ఎల్ 1బి వీసాలున్న ఐటీ ప్రొఫెషనల్స్ ను నియమించుకునే విషయంలో ఆంక్షలు విధించడం ఈ బిల్లు ఉద్దేశం.
50 మంది కంటే ఎక్కువ మంది హెచ్ 1బి, ఎల్ 1 బి వీసాలున్న ఉద్యోగులను కలిగి ఉన్న కంపెనీలు 50 మంది కంటే ఎక్కువ మందిని ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు, ఈ తరహా వీసాలున్న వారిని నియమించం కుదరదు. ఇదీ ఈ బిల్లు సారాంశం.
అటు డెమొక్రటిక్ పార్టీ, ఇటు రిపబ్లికన్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లు అమెరికా కాంగ్రెస్ లో ఆమోదం పొందింతే భారతీయ కంపెనీలు ఈ తరహా వీసాలున్న ఐటీ ప్రొఫెషనల్స్ ను నియమించే విషయంలో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. భారతీయ కంపెనీలకు ఇది పెద్ద విఘాతంగా భావిస్తున్నారు.
అమెరికాలో తయారయ్యే ప్రతిభావంతులైన హైటెక్ ప్రొఫెషనల్స్ కు ఉద్యోగ అవకాశాలు పెద్దగా లేవనేది చట్ట సభల సభ్యుల వాదన. ఇన్ సోర్సింగ్ ఉద్యోగాలు తగ్గకుండా, పెరగాలంటే ఇలాంటి ఆంక్షలు అవసరమని వాళ్లు చెప్తున్నారు. ఒక వేళ ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ తర్వాత సెనేట్ కు వెళ్తుంది. అక్కడ బిల్లు పాసైతే అధ్యక్షుడి సంతకంతో అది చట్టంగా మారుతుంది.
అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు తన్నుకుపోతున్నారని ఇప్పటికే కొందరు విమర్శిస్తున్నారు. అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్న డోనాల్డ్ ట్రంప్ కూడా ఇలాగే కామెంట్ చేశారు. అయితే భారతీయ ప్రొఫెషనల్స్ నైపుణ్యం, పనితీరు, పనిపట్ల అంకిత భావం కారణంగా అమెరికాతో పాటు అనేక దేశాల్లో వాళ్లకు మంచి పేరుంది. అయితే ఇలాంటి చట్టాలవల్ల ఇప్పుడు భారతీయ కంపెనీల జోరుకు కళ్లెం పడవచ్చని భావిస్తున్నారు.