వైఎస్ హయాంలో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రయత్నించిన భూ పందేరాల్లో ఒకటి లేపాక్షి. అనంతపురం జిల్లాలో బెంగళూరుకు కాస్త దగ్గరగా ఉండే వేల ఎకరాల భూముల్ని వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో ఇందు ప్రాజెక్ట్స్‌కు.. ఎకరం రూ. యాభై వేలకు చొప్పున కేటాయించారు. వాటిలో ఏ మాత్రం పరిశ్రమలు.. ప్రాజెక్టులు.. పెట్టని ఇందూ ప్రాజెక్టులు భూముల్ని తనఖా పెట్టి వేల కోట్ల రుణాలు తెచ్చుకుని దారి మళ్లించి వాడేసుకుంది. వాటిలో కొన్ని జగన్ సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించిందని సీబీఐ కేసులు పెట్టింది. ఈడీ ఆ ఆస్తులను ఆటాచ్ చేసింది. ఇదే సందనుకుని ఇందు ప్రాజెక్ట్స్ రుణాలు కట్టలేమని చెప్పేసింది.
వ్యూహాత్మకంగా ఆ కంపెనీని దివాలా తీయించారు. అంతకు ముందు ఆ కంపెనీతో భూముల్ని తనఖా పెట్టించారు. జగన్ సీఎం అయ్యాక మరోసారి ఆ భూముల్ని కొట్టేసే ప్రయత్నాలు జరిగాయి. ఇందు ప్రాజెక్ట్స్ భూములపై రూ. ఐదు వేల కోట్ల వరకూ అప్పులిచ్చిన బ్యాంకులు… దివాలా ప్రక్రియలో రూ. ఐదు వందల కోట్లిస్తే చాలని అంగీకరించాయి. అంటే ఆ ఐదు వందల కోట్లు తీసుకుని ఇందూ భూములన్నీ ఇచ్చేస్తామని ఒప్పందం చేసుకోవడం అన్నమాట. నిజానికి ఆ కేటాయింపుల్ని ప్రభుత్వం ఎప్పుడో రద్దు చేసింది. ఈడీ అటాచ్‌లో ఉన్నాయి.
అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి.. భూముల్ని కాపాడేందుకు ప్రయత్నించాలి. తాము కేటాయింపులు రద్దు చేశామని చెప్పాలి. కానీ ఇక్కడ ఉన్న వారికే ఆ భూములు దఖలు పడతాయి కాబట్టి. .. సైలెంట్‌గా ఉండిపోయారు. కానీ ఇప్పటి ప్రభుత్వం సైలెంట్ గా ఉండేందుకు సిద్ధంగా లేదు. ఆ భూముల్లో పారిశ్రమిక పార్కును ప్రతిపాదిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ భూములు ప్రభుత్వ స్వాధీనానికి న్యాయపరమైన చర్యలు ప్రారంభిస్తున్నారు. మరోసారి జగన్ బినామీల ఖాతాల్లోకి వెళ్లకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.