ఏలో పారిశ్రామిక అభివృద్ధే లక్ష్యంగా ఐదు కొత్త పాలసీలు, నాలుగు క్లస్టర్లను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఎంఎస్ఎంఇ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటి అండ్ క్లౌడ్, టెక్స్టైల్ రంగాల్లో కొత్త పాలసీలు తీసుకురానున్నారు. కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తారు. వీటికి వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు.
కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లస్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ సంస్థల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. దీనిపై స్టేక్ హోల్డర్లతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు. 2019కు ముందు ఫ్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు చేసుకున్న ఒప్పందాలను అమల్లోకి తేని పారిశ్రామిక వేత్తలతో సంప్రదింపులు ప్రారంభించారు. కృష్ణపట్నం, నక్కపల్లి, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లలో వేగంగా పనులు జరిగేలా చూడనున్నారు.
2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా అనంతరం వచ్చిన ఫ్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేయడంలో చాలా కంపెనీలు ఇక్కడ నుండి వెళ్లిపోయాయి. వారికి రాష్ట్రంపై నమ్మకం కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ ప్రాంతాల్లో పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న 1382 ఎకరాల్లో ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పారిశ్రామివేత్తలకు 60 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే వైసిపి ప్రభుత్వ హయాంలో 34 శాతమే చెల్లించారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలోని పారిశ్రామికవాడలో భూముల రేట్లు తగ్గించి పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని నిర్ణయించారు.
విశాఖ నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్పార్కు, రూ.60 వేల కోట్లతో ఏర్పాటు చేసే ఎన్టిపిసి గ్రీన్ హైడ్రోజన్ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బిపిసిఎల్ ప్రాజెక్టుపై వేగంగా నిర్ణయాలు తీసుకునేలా చర్యలు ఉండనున్నాయి. మరో ఏడాదిలో స్పష్టమైన మార్పు చూపించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.