జగన్ హయాంలో వైసీపీ నేతలు భూములను బుక్కేసినట్లుగా కబ్జాలు చేశారు. అధికారం ఉందని రెచ్చిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విలువైన భూములను చెరబట్టారు. జగన్ సొంత జిల్లాలో ఈ కబ్జాల పర్వం శృతిమించినట్లుగా తెలుస్తోంది. భూకబ్జాలకు అధికారులు కూడా సహకరించడంతో అడ్డూ, అదుపు లేకుండా ఇష్టానుసారంగా వైసీపీ నేతలు భూదందా చేసినట్లుగా తెలుస్తోంది.
కడప జిల్లాలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేశారని, అక్రమ లేఅవుట్లు వేసి భూదందాకు తెరలేపారని ఫిర్యాదులతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్ రాష్ట్ర అదనపు డైరక్టర్ ఆధ్వర్యంలో విచారణ బృందాలను ఏర్పాటు చేయగా..జిల్లాకు చేరుకున్న ఈ బృందాలు మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి భూదందాపై తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నాయి.
Also Read : 40 రోజుల్లో నాలుగుసార్లు.. జగన్ బెంగళూరు పర్యటనల సారాంశం ఏంటి?
వైసీపీ నేతలు కబ్జా చేసిన స్థలాల్లో వెంచర్లు ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. సెంటు స్థలం 10నుంచి 15 లక్షల మధ్య విక్రయించినట్లుగా తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు భారీగానే సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. కడప లోక్ సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి.. భూదందా చేసినట్లుగా జిల్లాకు చేరుకున్న విచారణ అధికారులకు ప్రజా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు.
ఇక, జిల్లావ్యాప్తంగా 585అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారికంగా గుర్తించగా.. అనధికారికంగా 1000 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో వీటన్నింటిని గుర్తించి ప్రభుత్వానికి విచారణ అధికారులు నివేదిక సమర్పించనున్నారు. అనంతరం అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై సర్కార్ కొరడా ఝులిపించనుందని వైసీపీ నేతల్లో అప్పుడే టెన్షన్ మొదలైనట్లుగా తెలుస్తోంది.