టీడీపీ నేతలు వరుసగా వైసీపీలో చేరిపోతున్నారని మైండ్ గేమ్ ఆడేందుకు.. వైసీపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీలో అసంతృప్తిగా ఉన్న ప్రతి ఒక్కరి “విలువ”ను గుర్తిస్తోంది. దాంతో.. చాలా మంది ఒత్తిళ్లకు గురై.. కుండువా కప్పించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో.. జగన్ అండ్ పార్టీ బృందం దృష్టి… టీడీపీ టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మల్యే… పులవర్తి నారాయణమూర్తిపై పడింది. ఆయన తూ.గో జిల్లా పి.గన్నవరంకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే. పి.గన్నవరం టికెట్ చంద్రబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన నారాయణ మూర్తిని కాదని స్టాలిన్ అనే కొత్త వ్యక్తికి ఇచ్చారు. దీంతో నారాయణమూర్తి అసంతృప్తికి గురయ్యారు. వెంటనే వైసీపీ నేతలు టచ్‌లోకి వచ్చారు. పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ సహా.. చాలా హామీలిచ్చారు. ఒత్తిడి చేశారు. చివరికి నారాయణమూర్తి అంగీకరించారు.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రోడ్ షోకు జగన్ వస్తారని.. అక్కడ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పిలిచినట్లుగానే నారాయణమూర్తి ఆయన వద్దకెళ్ళారు. బస్సు ఎక్కి ప్రజలకూ..జగన్‌కూ అభివాదం చేసారు. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు వైసీపీ నేతలు మైకులో ప్రకటన చేశారు. జగన్ కండువా కప్పబోయారు. కానీ నారాయణమూర్తి అడ్డుకున్నారు. రెండో సారి కూడా జగన్ బలవంతంగా కండువా వేయబోయినా ప్రతిఘటించారు. గట్టిగా కండువాను పక్కకు తోసేశారు. జగన్ ఒప్పజెప్పబోయినా…ఆయన వినలేదు. దీంతో షాకయిన జగన్ కండువా పక్కనున్న నేత చేతిలో పెట్టి నారాయణమూర్తిని పంపేయాల్సోందిగా అసహనంగా వైసీపీ నేతలకు సైగలు చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా నారాయణమూర్తి మరోసారి ప్రజలకు అభివాదం చేసి దిగి వచ్చేశారు.
కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరేందుకు వచ్చానని… కానీ పునరాలోచన చేశానని చెప్పుకున్నారు. చంద్రబాబు తనకు అంత అన్యాయం ఏం చేయలేదన్నారు. జగన్ సమక్షంలోనే ఇలా జరగడంతో జిల్లా వైసీపీ నేతలు తలలు పట్టుకున్నారు. జగన్ కూడా జిల్లా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ వైసీపీ నేతల పరువు మాత్రం పోయినట్లయింది. ఇష్టం లేని నేతల్ని ఒత్తిడి తెచ్చి.. పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తే ఇలానే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.