”ఏక్ మినీ కథ’ సంతోష్ శోభన్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా హిట్. ఈ సినిమా తర్వాత మారుతితో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు సంతోష్. మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరో తెరకెక్కిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. మెహరీన్ హీరోయిన్. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సంతోష్ చెప్పిన సినిమా కబుర్లు…
కరోనా సమయంలో షూటింగ్ అంటే భయపడ్డారా ?
భయం వుంది. కానీ పని కావాలి. పని దొరకడమే పెద్ద ధైర్యం. పని లేకపోతే ఎలా ? ఎలా గడుస్తుంది.? ఆకలి మీద వున్నాం. భయానికి స్థానం లేదు. మారుతి గారి లాంటి దర్శకులతో పని చేసే అవకాశం రావడమే పెద్ద ధైర్యం. ఎక్సయిట్మెంట్.
ఎక్ మీని కథ వల్లనే యూవీలో మళ్ళీ ఈ ఆవకాశం వచ్చిందా ?
అవును. మారుతి, వంశీ .. ఎక్ మినీ కధ చూశారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే పిలిచి ఈ కథ చెప్పారు. వెంటనే సెట్స్ పైకి వెళ్ళిపోయాం.
ఎక్ మీని కథ లానే ఇందులో కూడా ఏదైనా ప్రాబ్లం గురించి చూపిస్తారా ?
అలా కాదు. ఈ సినిమా చాలా పెక్యులర్ స్టొరీ. భయం, ఆందోళన వలన కలిగే నష్టాలు ఇందులో చాలా హెలేరియస్ గా డీల్ చేశారు.
కరోనా అంటే భయం ఇప్పుడు అంతగా లేదు కదా .. మరి జనాలు కనెక్ట్ అవుతారా ?
ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మారుతి గారి మార్క్ లో వుంటుంది.
మీకు ఓటీటీ థియేటర్ అనే లెక్కలు ఉన్నాయా ?
అస్సల్ లేవు. నాటకాలు చేసి వచ్చాను. నాకు టీవీ అయినా ఓకే.
రెండు వెండితెర విజయాలు తర్వాత ఒక వెబ్ సిరిస్ చేసేఅవకాశం వస్తే ఓకే చెబుతారా ?
ఖచ్చితంగా. రేపు ఎలా వుంటుందో తెలీదు. ఇన్ని లెక్కలు వేసుకోవడం అనవసరం. మంచి కంటెంట్ వుంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే.
ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారనే నమ్మకం వచ్చిందా ?
అలాంటి ఆలోచనే రాదు. సెటిల్ అనే మాటే వుండదు. సెటిల్ అంటే రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అనే ఫీలింగ్ వస్తే అవకాశం కోల్పోతాం. రిలాక్స్ అయితే మన అవకాశం ఇంకొకరికి వెళ్ళిపోవడమే.
ఎమోషనల్ , కామెడీ.. ఎలాంటి సీన్స్ చేయడానికి ఇష్టపడతారు ?
మారుతిగారి సినిమాలో ఎలాంటి సీన్స్ అయినా ఈజీగా చేయొచ్చు.
లిప్స్ లాక్స్ కూడా ఈజీనా ?
నిజంగా లిప్ లాక్ కష్టం. నేను సిగ్గరిని. అన్ని సీన్స్ చేసినట్లే ఆ సీన్ కూడా చేయాలి. సెట్స్ లో అంతమంది వుండగా లిప్ లాక్ లాంటి సీన్లు చేయడం అంత తేలిక కాదు. ఓపెన్ గా లిప్ లాక్ చేయడం మన కల్చర్ కాదు కదా .. కొంచెం కష్టమే. అయితే ఇలాంటి సీన్లు చేసేటప్పుడు చాలా టెక్నికల్, ప్రొఫెషనల్ గా చేసినప్పుడే వర్క్ ఈజీ అవుతుంది.
ఈ సినిమాతో ఏం నేర్చుకున్నారు ?
మారుతి గారు గ్రేట్ పర్శన్. సమస్య వస్తే సమస్యని కూడ తనకి అనూకులంగా మార్చుకుంటారు. ఆ లక్షణం ఆయన నుంచి నేర్చుకున్న.
మీ నాన్న గారితో ఎలాంటి ఎటాచ్ మెంట్ వుండేది ?
నాకు ప్రపంచం పరిచయం అవుతున్న సమయంలో వెళ్ళిపోయారు. కానీ ఆయన మిగిల్చిన మంచితనం నన్ను ఇప్పటికీ కాపాడుతుంది. మీడియా, ఇండస్ట్రీ నన్ను గొప్పగా ఆదరించింది. ఇదంతా మా నాన్నగారి మంచితనమే.
డైరెక్షన్ వైపు వెళ్లాలని అనిపించలేదా ?
లేదు. నా ధ్యాస అంతా నటన వైపే
కొత్త సినిమా కబుర్లు ?
నందిని రెడ్డిగారితో సినిమా చేస్తున్న. యూవీలోనే మరో సినిమా వుంది. శ్రీదేవి శోభన్ బాబు సినిమా కూడా లైన్ లో వుంది. ఇంకొన్ని సినిమాలు చర్చలో వున్నాయి.
అల్ ది బెస్ట్ ..
థ్యాంక్ యూ..