ప్రేమ ఇష్క్ కాదల్, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, సెకండ్ హ్యాండ్, మా అబ్బాయి… ఇలా వైవిధ్యభరితమైన కథలతో ప్రయాణం సాగిస్తున్న నటుడు శ్రీవిష్ణు. కథానాయకుడిగా అవకాశాలొస్తున్న తరుణంలోనూ మరో హీరో సినిమాలో కీలక పాత్ర వస్తే.. ‘నో’ అనకపోవడం శ్రీవిష్ణు ప్రత్యేకత. అందుకే ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో చిన్న పాత్రలో ఇలా మెరిసి.. అలా మాయమయ్యాడు. ఇప్పుడు ‘ఉన్నది ఒకటే జిందగీ’లోనూ ఫ్రెండ్ బ్యాచ్‌లో ఒకడిగా కనిపించబోతున్నాడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణుతో జరిపిన చిట్ చాట్ ఇది.
* హాయ్ విష్ణు..
– హాయ్…
* హీరోగా స్థిరపడాలనుకొంటున్న తరుణంలో ఇలాంటి రోల్స్ చేయడం అవసరమా?
– అవసరమేనండీ. దర్శకుడు తిరుమల కిషోర్ ఈ కథ చెబుతున్నప్పుడు హీరో పాత్ర కంటే ఆ ఫ్రెండ్ పాత్రకే ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఈ రెండు పాత్రల్లో ఏదో ఒకటి ఎంచుకో.. అని దర్శకుడు చెబితే కచ్చితంగా ఇప్పుడు చేసిన పాత్రనే ఎంచుకొందును. ఆ పాత్ర అంత బాగా నచ్చేసింది.
* ఫ్రెండ్ క్యారెక్టర్లో అంత డెప్త్ ఏం చూశారు?
– తిరుమల కిషోర్ మంచి రైటర్. అన్ని పాత్రల్నీ ప్రేమించి రాస్తాడు. వాసు పాత్రని ఇంకొంచెం ఎక్కువ ప్రేమించాడనిపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు నాలో మీ బెస్ట్ ఫ్రెండ్‌ని చూసుకొంటారు. నా ఫ్రెండ్ కూడా ఇలానే ఉండేవాడు కదా అనుకొంటారు. సినిమా అయిపోయిన తరవాత కూడా నా పాత్ర కళ్ల ముందు కదులుతుంటుంది. నా పాత్ర తీరుతెన్నులు కచ్చితంగా షాకింగ్‌గా ఉంటాయి. ప్రామిస్.
* రామ్‌తో సెట్లోనూ ఫ్రెండ్ షిప్ కుదిరిందా?
– నా యాక్టింగ్ స్టైల్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుందండీ. నా సహ నటుడి హావభావాలను బట్టి రియాక్షన్స్ ఇస్తుంటాను. రామ్ నాతో మింగిల్ కాకపోతే.. వాసు పాత్రని నేను పండించకలేకపోదును. తను చాలా మంచి ఆర్టిస్ట్. చాలా సపోర్ట్ చేశాడు. తన దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నా.
* దర్శకుడు కిషోర్ మీకు మంచి ఫ్రెండ్ అట కదా?
– అవును. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా సెకండ్ హ్యాండ్లో నేనే హీరో. అప్పటి నుంచీ మా పరిచయం కొనసాగుతోంది.
* మీరు కథానాయకుడిగా నటించిన అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కానీ వసూళ్లు రాలేదు. కారణాలు విశ్లేషించారా?
– సినిమా చూసినవాళ్లంతా బాగుంది.. బాగుంది అన్నారు. కానీ… సరైన వసూళ్లు రాలేదు. ఆ సమయంలో పెద్ద పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అందుకే మా సినిమా జనంలోకి వెళ్లలేకపోయింది. ప్రచారం విషయంలోనూ తప్పులు చేశాం.
* శ్రీ విష్ణు అనే ఓ నటుడు ఉన్నాడన్న విషయాన్ని పరిశ్రమ గుర్తించిందా? ఈ విషయంలో మీకేమైనా అసంతృప్తులున్నాయా?
– నన్ను పరిశ్రమ గుర్తించిందే అనుకొంటున్నా. నా కెరీర్లో మంచి సినిమాలే చేశా. నటుడిగా నేనెప్పుడూ ఫెయిల్ కాలేదనే అనుకొంటున్నా. నా దగ్గరకు కొత్త దర్శకులు కథలు పట్టుకొని వస్తున్నారు. అవన్నీ వైవిధ్యంగానే ఉంటున్నాయి. `శ్రీవిష్ణు ఇలాంటి పాత్రలైతే బాగా చేస్తాడు` అనే విషయం వాళ్లకైతే అర్థమైందనే అనుకొంటున్నా.
* షార్ట్ ఫిల్మ్స్‌లో మెరుపులు మెరిపించినవాళ్లంతా దర్శకులు అవుతున్నారు. సినిమా తీయడంలో వాళ్లకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా?
– కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ప్రాక్టికల్‌గా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అయితే వాటిని అధిగమించే శక్తిమాత్రం వాళ్లలో ఉంది. కాలేజీ అవ్వగానే సినిమాలపై వ్యామోహంతో షార్ట్ ఫిల్మ్స్‌ని చేసి తమని తాము నిరూపించుకొంటున్నారు. సినిమాలపై సంపూర్ణ అవగాహన లేకపోవడం కూడా వాళ్లకు బాగానే కలిసొస్తుంది. అప్పుడే వాళ్లు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా ఆలోచించగలుగుతారు. చదువుకొన్న వాళ్లు దర్శకులవ్వడం ఇంకా మంచిది. కథకు ప్రాధాన్యం పెరుగుతుంటుంది.
* చిన్న సినిమా అంటే కనీసం మూడు కోట్లు పెట్టాల్సిందే. దాన్ని తిరిగి రాబట్టుకొనే సురక్షిత మార్గాలు ఎంత వరకూ ఉన్నాయి?
– గతంతో పోలిస్తే ఇప్పుడే చిన్న సినిమాలకు మార్కెట్ బాగుంది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ రూపంలో ఎంతో కొంత తిరిగి వస్తుంది. రూ.2 – రూ.3 కోట్ల రూపాయలతో సినిమాలు తీశామనుకోండి. అది హిట్టయితే రూ.20 కోట్ల వరకూ రాబట్టుకొనే అవకాశం ఉంది. అంటే.. దాదాపు 5 రెట్లు లాభమన్నమాట. పెద్ద పెద్ద సినిమాల్లో లాభాల శాతం ఈ స్థాయిలో ఉండదు.
* మెంటల్ మదిలో ఎప్పుడు వస్తుంది?
– ఇప్పటికే ఈ సినిమా విడుదల కావల్సింది. అయితే కాస్త ఆలస్యమైంది. ఈ ఆలస్యం కూడా మంచిదే. ఎందుకంటే `ఉన్నది ఒకటే జిందగీ` తరవాత నాకు మరింత గుర్తింపు వస్తుందన్న ఆశ ఉంది. అది ఆ సినిమాకి ప్లస్ అవుతుంది.
* రాబోయే సినిమాలేంటి?
– నీదీ నాదీ ఒకే కథ విడుదలకు సిద్దమైంది. నా మనసుకి బాగా దగ్గరైన కథ ఇది. ప్రస్తుత సమాజంపై ఓ వ్యంగ బాణం. తప్పకుండా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే చిత్రం అవుతుంది.