పెగాసస్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు కేంద్రం ఎంత చాకచక్యంగా వ్యవహరించిందో ఇప్పుడు అదానీ విషయంలోనూ అంతే తెలివి తేటలు చూపించింది. సుప్రీంకోర్టు విచారణలో ఇన్వెస్టర్ల భద్రతపై సందేహాలు వ్యక్తం చేయడంతో చివరికి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించకుండా కేంద్రమే కమిటీ వేయడానికి ముందుకు వచ్చింది. అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడిందని హిండెన్ బర్గ్ ఆరోపించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్రం వివరణ కోరింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
హిండెన్‌బర్గ్ నివేదికపై మిటీ వేసేందుకు కేంద్రం అంగీకరించింది. అదానీ వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని తుషార్ మొహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని సెబీ పర్యవేక్షిస్తోందని చెప్పారు. కేంద్రం వివరణపై స్పందించిన న్యాయమూర్తి బుధవారంలోగా కమిటీ సబ్యుల పేర్లను సుప్రీంకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ కు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. దీంతో.. నొప్పింపక తానొవ్వక అన్న రీతిలో ఈ వివాదాన్ని ఇంతటితో కామ్ చేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అదానీ షేర్లు పతనం బాటలోనే ఉన్నాయి. ఒక్కో సారి పెరుగుతాయి.. మరోసారి తీవ్రంగా పడిపోతాయి. ఇప్పటికీ అనుమానాస్పందగానే ఉన్నాయి. సోమవారం దాదాపుగా ఏడు శాతం వరకూ షేర్లు పడిపోయాయి .అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎప్పటికప్పుడు తగ్గిపోతోంది. రుణాల చెల్లింపుల విషయంలో అదానీ గ్రూప్ చేస్తున్న ప్రకటనలు కూడా గందరగోళంగా ఉంటున్నాయి. ముందు ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి మార్కెట్ వర్గాల్లో ఉంది.