వచ్చీ రావడంతోనే స్టార్ డైరెక్టర్ల చేతిలో పడిపోయాడు అల్లు అర్జున్. తొలి సినిమానే… వంద సినిమాలు చేసిన రాఘవేంద్రరావుతో! ఆర్య మినహాయిస్తే… మిగిలిన దర్శకుంతా హిట్లున్న వాళ్లే. డెబ్యూ డైరెక్టర్లతో బన్నీ పనిచేసింది లేదు. వినాయక్, పూరి, త్రివిక్రమ్, గుణశేఖర్, బోయపాటి.. ఇలా ఎప్పటికప్పుడు స్టార్ దర్శకులతో పనిచేస్తూ తన స్టామినా పెంచుకొంటూ పోయాడు. ఆర్య తరవాత తొలి సారి ఓ డెబ్యూ దర్శకుడితో పనిచేయడానికి రెడీ అయ్యాడు బన్నీ. `నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా`గా అది రూపుదిద్దుకొంటోంది. ఆ తరవాత కూడా కొత్త దర్శకుడితోనే పనిచేయాలని ఫిక్సయ్యాడట. `టైగర్` తీసిన వి.ఐ ఆనంద్‌తో బన్నీ సినిమా చేయబోతున్నాడన్నది టాక్. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు గానీ – కొత్త దర్శకులకు చేయూత నివ్వడం నిజంగా హర్షించదగిన పరిణామమే.
అయితే.. బన్నీ ప్రయోగాలు చేయాల్సిన టైమ్ అయితే కాదిది. రేసుగుర్రం తరవాత సరైనోడు వరకూ బన్నీకి సరైన హిట్ దక్కలేదు. దువ్వాడ జగన్నాథమ్ కూడా సరిగా ఆడలేదు. `నా పేరు సూర్య` కూడా కాస్త రిస్కీ ప్రాజెక్టే. ఎందుకంటే దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. ఇది వరకు చాలా ప్రయత్నాలు చేసీ, చేసి.. చివరికి బన్నీ దగ్గరకు చేరాడు. ఈ సినిమా వరకూ ఓకే. తరువాతిది కూడా కొత్త దర్శకుడితోనే అంటే.. అది ఇంకా రిస్క్ కిందే లెక్క. టాప్ దర్శకులతో బన్నీలాంటి హీరోలు పనిచేస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది. చేతిలో విజయాలున్నప్పుడు, పట్టిందల్లా బంగారం అవుతున్నప్పుడు కొత్త దర్శకులతో ఎన్ని ప్రయోగాలు చేసినా చల్తా. ఇలాంటప్పుడే కాస్త జాగ్రర్తగా ఉండాలి. కాకపోతే… టాప్ దర్శకులంతా ఇప్పుడు ఖాళీగా లేరు. త్రివిక్రమ్, సుకుమార్, కొరటాల శివ లాంటివాళ్లంతా కాస్త ఖాళీ అవ్వడానికి టైమ్ పడుతుంది. అందుకే… నవ దర్శకుల్ని నమ్ముకోవాల్సివస్తోంది.