ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలకు రస్ అల్ ఖైమాతో చాలా పెద్ద సమస్య వచ్చింది. వైఎస్ హయాంలో వచ్చిన బాక్సైట్ పరిశ్రమ.. వాన్ పిక్ పోర్టుల విషయంలో రస్ అల్ ఖైమా వద్ద నుంచి రూ. వందల కోట్ల పెట్టుబడులు సేకరించారు. అయితే ఆప్రాజెక్టులు వివిధ కారణాలతో మూలన పడటంతో వాటిని తిరిగి చెల్లించాలంటూ రస్ అల్ ఖైమా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. రెండింటిలో ఏ కేసులోనో కానీ.. ఆ పెట్టుబడులు పెట్టించడంలో కీలకంగా వ్యవహించిన నిమ్మగడ్డ ప్రసాద్ అనే వ్యక్తిని సెర్బియాలో పట్టుకుని ఏడాది పాటు జైల్లో పెట్టారు. కరోనా పుణ్యమా అని ఆయన బయటకు వచ్చేశారు.
ఇప్పుడు ఆ లెక్క సెటిల్ చేయకపోతే.. చాలా మంది విదేశాలకు వెళ్లే పరిస్థితి ఉండదు. పైగా ఏపీ ప్రభుత్వంపై రాకియా ఆర్బిట్రేషన్‌కు కూడా వెళ్లింది. ఆ వివాదంతో తమకు సంబంధమే లేదని.. మీరే పరిష్కరించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. వాటా కోనుగోలు చేయాలని.. ఏపీ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కానీ అది ఇంకా అనేక సమస్యలకు కారణమయ్యేలా ఉంది. అందుకే మధ్యేమార్గంగా .. పెన్నా కంపెనీ ద్వారా ఆ వాటాల్ని కొనుగోలు చేయించి…లెక్క సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారు.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో పెన్నా ప్రతాపరెడ్డి కూడా నిందితుడే. బాక్సైట్ ఖనిజ వ్యాపారంలో ఆయన షేర్ ఉంది. ఆయనకూ లెక్క ప్రకారం వందల కోట్ల నష్టం రావాలి. అయితే ఎంత నష్ట వచ్చినా ఆయనతోనే ఆ వాటాలు కొనిపించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. రూ. వందల కోట్లు నష్టపోయి ఎందుకు ఆ వాటాలు ఆయన కొంటారన్నది ఇప్పుడు ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.