బాహుబలి-2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ దుమ్ముదులిపేసింది. వసూళ్ళ విషయంలో మాత్రం బాహుబలి సినిమా సాధించిన అద్భుతమైన రికార్డ్స్‌ని అందరూ ఒప్పుకోవాల్సిందే. మార్కెటింగ్ తెలివితేటలా? మేకింగ్ తెలివితేటలా అనే విషయం పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ దగ్గర అసాధ్యమనుకున్న మేజిక్‌ని చేసి చూపించాడు రాజమౌళి. ఇక బాహుబలి సినిమాపై తమకు తోచినట్టుగా విమర్శలు చేస్తున్న లౌకికవాదులు, విమర్శకుల విమర్శలు మాత్రం చాలా వరకూ సిల్లీగా ఉన్నాయి. రానా భార్యను ఎందుకు చూపించలేదు అని అడిగే అథమస్థాయి జనాలను పక్కన పెడితే హిందూత్వను రుద్దుతున్నారు. మనువాదాన్ని ప్రచారం చేస్తున్నారు అని మూర్ఖంగా విమర్శిస్తున్న వాళ్ళు మాత్రం బాహుబలి సినిమాపై, రాజమౌళిపై ఇంకాస్త ఎక్కువ అభిమానం కలిగేలా చేస్తున్నారు.
యుధ్ధంలో వందమందిని చంపితే వీరుడంటారు, ఒక్క మనిషి ప్రాణం కాపాడితే దేవుడంటారు అని బాహుబలి పార్ట్ ఒన్‌లో అద్భుతమైన డైలాగ్ చెప్పిన శివగామి పాత్ర….రెండో పార్ట్‌కి వచ్చేసరికి…..నా కొడుకును నువ్వు చంపుతావా? లేకపోతే నేనే చంపమంటావా? అన్నంత స్థాయికి ఎలా దిగజారింది, శివగామి అంత క్రూరంగా మారడానికి రాజమౌళి చెప్పిన కారణం సరిపోయిందా? అనేలాంటి విమర్శలు అయితే ఎక్కడా కనిపించలేదు కానీ శివలింగాన్ని చూపించారు. హిందుత్వాన్ని ప్రచారం చేశారు. దుష్టశక్తులను నల్లవాళ్ళుగా చూపించారు లాంటి విమర్శలు మాత్రం కోకొల్లలుగా వినిపించాయి. ఎక్కువ మంది ప్రజల దృష్టిలో రాక్షసులు అనగానే గుర్తొచ్చే రూపానికి దగ్గరగా ఉండేలా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నాడు రాజమౌళి. ఇక భారతదేశంలో రాజుల కాలం నాటి కథ అంటే హిందూ దేవుళ్ళు, హిందూ ఆచారాలు కాకుండా ఇంకేం ఉంటాయి? ఆనాటి సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సినిమా తీయడం కూడా తప్పేనా?
పికె అనే సినిమాలో ఇతర మతాల్లో ఉన్న లోపాలు, తప్పులను గట్టిగా పదినిమిషాలు చూపించలేదు కానీ హిందూ మతంపైన మాత్రం గంటన్నర పాటు విమర్శలు గుప్పించారు. అదే స్థాయిలో ఇతర మతాల్లో ఉన్న దేవుళ్ళం అని చెప్పుకునే జనాలు చేస్తున్న తప్పులను చూపించగలరా? ఆ ధైర్యం ఎవరికైనా ఉందా? ఓట్ల కోసం పాకులాడే రాజకీయ నాయకులంటే మత రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈ లౌకికవాదులకు, హేతువాదులకు ఏం సమస్య ఉంది? హిందువుల సంఖ్య మెజారిటీ అవ్వడమే వాళ్ళు చేసుకున్న పాపమా? మైనారిటీ సంఖ్యలో జనాలు ఉంటే ఇక ఆయా మతాల్లో ఎంతటి దారుణమైన చట్టాలు ఉన్నా కూడా ఎవ్వరూ విమర్శించకూడదా? అంటే ఆ మతంలో ఉన్న భారతీయ పౌరుల హక్కులు కాలరాస్తుంటే వీళ్ళకు మాట్లాడే ధైర్యం ఎందుకు లేకుండా పోతోంది? హేతువాదులు, లౌకికవాదులు కూడా ఎంత సేపూ బిజెపికి నష్టం చేయడం కోసం హిందూత్వను టార్గెట్ చేయడం ఏంటి? అన్ని మతాల విషయంలోనూ సమంగా స్పందించాలి కదా. తలాక్ విధానంపై దేశంలో ఉన్న ఏ ఒక్క హేతువాది కూడా ఎందుకు స్పందించడం లేదు? మీడియాలో ఎందుకు స్పందించడం లేదు? దేశంలో అసహనం అంటూ ఇష్టం వచ్చినట్టుగా వాగేసిన హీరోలకు మహిళలకు అన్యాయం జరుగుతున్న విషయం తెలియదా?
హిందూత్వ పేరుతో రచ్చ రచ్చ చేస్తూ హిందువులకే నష్టం చేస్తున్న బిజెపి అనుబంధ సంఘాల చర్యలను కచ్చితంగా ఖండించాల్సిందే. కానీ హిందూ మతంలో ఉన్న లోపాలను మాత్రమే ఏకి పడేస్తాం. ఇతర మతాల్లో ఉన్న తప్పుల గురించి మాత్రం అస్సలు మాట్లాడం. హిందూ మతం గురించి ఎవరు నాలుగు మాటలు చెప్పినా ఒప్పుకోం…..ఇతర మతస్థులు మాత్రం హిందూ మతం కంటే మా మతం గొప్పది అని చెప్పి బహిరంగంగా ప్రచారం చేసుకోవచ్చు అనే అలిఖిత రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నవాళ్ళు అసలు హేతువాదులు, లౌకికవాదులు ఎలా అవుతారు? అన్ని మతాల్లో ఉన్న అతివాదులకు, వీళ్ళకు తేడా ఏం ఉంది?