జగన్ బంధువు .. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఏదో ఒకటి తేల్చుకోవాలన్న ఉద్దేశంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి తరపు బంధువు కావడంతో ఆయనకు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయింది. మంత్రి పదవి నుంచి తొలగించారు . జిల్లా రాజకీయాల్లో వేలు పెట్టకుండా చేశారు. జిల్లాలో వైవీ సుబ్బారెడ్డి పెత్తనమే సాగుతోంది. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఏదో ఒకటి చేయాలన్న ఆలోచలో ఉన్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌లో ముఖ్య అనుచరులతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది.
రాజకీయంగా ఏం చేద్దామన్నదానిపైనే అనుచరులను పిలిపించుకుని మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా ఆయన పవన్ కల్యాణ్ విషయంలో సాఫ్ట్ గా వ్యవహరిస్తున్నారు. తనపై పవన్ పార్టీకి చెందిన ఓ టీవీ చానల్లో వచ్చిన కథనాల విషయంలో.. పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడారు. వెంటనే బాలినేని కేసులను ఉపసంహరించుకున్నారు. తర్వాత వారి మధ్య బాండింగ్ కనిపిస్తోంది. చేనేత దినోత్సవం సందర్భంగా… చేనేత వస్త్రాలు ధరించాని పవన్ చాలెంజ్ చేస్తే బాలినేని ధరించి మరీ ఫోటో పెట్టి చూపించారు.
అయితే అంత మాత్రాన ఆయన జనసేనలోకి వెళ్తారని చెప్పలేం కానీ.. వైసీపీలో ప్రాధాన్యత కోసం ఆయన ఇలా చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటు వస్తుందని ఆయన నమ్ముతున్నారని.. సొంత పార్టీలో ఇక ఆదరణ లభించదని ఆయన డిసైడయ్యారని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో బాలినేని వ్యవహారం మాత్రం అంత తేలికగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.