హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు బీజేపీది కాదని ఆయన లీడ్‌లో ఉన్నప్పటి నుండే విస్తృత ప్రచారం జరిగింది. హుజురాబాద్‌లో బీజేపీకి ఎప్పుడూ కనీస క్యాడర్ లేదు. ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకున్న చరిత్ర కూడా లేదు. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్‌లో బీజేపీకి వచ్చింది 1683 ఓట్లు. అదే సమయంలో నోటాకు వచ్చిన ఓట్లు 2800పైనే ఓట్లు వచ్చాయి. అక్కడ అరకొరగా ఉన్న బీజేపీ నేతలు ఈటల రాజేందర్ పార్టీలో చేరిన తరవాత సైడైపోయారు. చాలా మంది టీఆర్ఎస్లో చేరిపోయారు.
బీజేపీ అభ్యర్థిని అని ఈటల రాజేందర్ ఎక్కడా చెప్పుకోలేదు. ఆయన కూడా పోటీ పార్టీల మధ్య కాకుండా తనకు, కేసీఆర్‌కు మధ్య జరుగుతున్నట్లుగానే ఉండాలని అనుకున్నారు. అందుకే గుర్తును మాత్రం ప్రచారం చేశారు కానీ ఎక్కడా పార్టీ ప్రస్తావన తీసుకు రాలేదు. టీఆర్ఎస్ నేతలు బీజేపీని హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే.. ఈటల వ్యూహాత్మకంగా ఈ ఎన్నిక బీజేపీకి సంబంధించినది కాదని ఓటర్ల మనసుల్లో నాట గలిగారు.
పైగా ఈటల రాజేందర్‌ను బీజేపీ అగ్రనేతలు పట్టించుకోలేదు. బండి సంజయ్ పాదయాత్రకు సంఘిభావం చెప్పడానికి వచ్చిన కేంద్రమంత్రులు ప్రచారానికి మాత్రం హుజురాబాద్ రాలేదు. అదే సమయంలో బండి సంజయ్ కూడా తప్పని సరి అన్నట్లుగా చివరిలో వచ్చి ప్రచారం చేశారు. కిషన్ రెడ్డి నామినేషన్ రోజు తప్ప కనిపించలేదు. అందుకే ఎవరూ ఈ విజయాన్ని బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా లేరు.ఈటల గెలుపుతో బీజేపీ పుంజుకున్నట్లుగా భావించడం లేదు.