కేంద్రమంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు మళ్లీ పార్టీ బాధ్యతలు ఇవ్వబోతున్నారా…? ఎన్నికలకు ముందు ఆయన్ను తప్పించి తప్పు చేశామన్న భావనలో కేంద్ర నాయకత్వం ఉందా…? ఈటలకు అధ్యక్ష బాధ్యతలను అప్పగించటం బండి సంజయ్ కు ఇష్టం లేదా?
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నా… ఆయన కేంద్రమంత్రిగానే ఫుల్ టైం పనిచేస్తున్నారు. దీంతో రాష్ట్ర పార్టీ పెద్దగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవటం లేదు.
నిజానికి ఎన్నికలకు ముందు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీకి మంచి మైలేజ్ వచ్చినా… ఆయన్ను తప్పించారు. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. ఆ తర్వాత ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు అలా గడిచిపోయాయి. ఏ క్షణమైన కిషన్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుండి తప్పిస్తారన్నది పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ను తప్పిస్తే ఈటలకు ఛాన్స్ ఉంటుంది అని అంతా అనుకుంటున్న సమయంలో బండి సంజయ్ మళ్లీ యాక్టివ్ కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కేంద్రమంత్రిగా ఉన్నా, ఈ మధ్య రాష్ట్ర వ్యవహరాల్లో బండి సంజయ్ చురుగ్గా ఉంటున్నారు. ఖమ్మం వరదల విషయంలోనూ పార్టీ తరఫున ఆయన పర్యటనకు రెడీ కావటం, ఈ లోపు ఈటల కూడా ముందుకు రావటంతో రెండు బృందాలుగా వెళ్తున్నారు. అయితే, బండి స్పీడ్ పెంచటంతో… ఆయన్ను మళ్లీ రాష్ట్ర బాధ్యతలకు పంపుతారా? కేంద్రమంత్రిగా ఉన్నా రాష్ట్ర పార్టీ బాధ్యతలు కూడా అప్పగించబోతున్నారా? అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈటలకు ఛాన్స్ ఇవ్వటంపై బండి సంజయ్ వ్యతిరేకంగా ఉండటంతో పార్టీ అధినాయకత్వం కూడా గతంలో చేసిన తప్పుతో మరోసారి బండికే అవకాశం ఇవ్వబోతుందన్న ప్రచారం జోరుగా పార్టీలో సాగుతోంది.