తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ మీద దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడాచేస్తున్నారు. ఈ క్రమంలో అభిప్రాయసేకరణలు.. సర్వేలు నిర్వహించి చివరికి… నలభై,యాభై మంది ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపించాలని నిర్ణయించారని తెలంగాణ భవన్‌లోనే విస్తృత చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం కేసీఆర్‌లో ఉంది. గతంలో ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లి.. ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇచ్చారు. దీంతో అప్పుడు ఎమ్మెల్యేల అంశం కాకుండా…కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అన్న అంశమే తెరపైకి వచ్చింది.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలపై ప్రజల అసంతృప్తి ఎక్కువగా ఉంది. కేసీఆర్ అనుకుంటే ఇట్టే అందర్నీ తీసి పక్కన పెట్టేయగలరు. కానీ తర్వాత పరిణామాలు మాత్రం చాలా వేగంగా మారిపోతాయి. ఎందుకంటే బీజేపీ కాచుకుని కూర్చుకుంది. టిక్కెట్ లేదని క్లారిటీ వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేనూ తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఢిల్లీలో అమిత్ షా తమ పార్టీ నేతలకు అదే దిశలో దిశానిర్దేశం చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా వెంటనే తీసుకోవాలన్నారు. బెంగాల్ మోడల్‌ను అనుసరించాలని స్పష్టం చేశారు. బెంగాల్లో దీదీ పార్టీతో దూరం పెరిగిన ప్రతి ఒక్కరిని బీజేపీలో చేర్చుకున్నారు.
ఆ ప్రభావం బాగా కనిపించింది.గట్టి పోటీ ఇచ్చారు. కానీ గెలవలేకపోయారు. కానీ అక్కడ దీదీకి ఉన్నంత పాజిటివ్ తెలంగాణలో కేసీఆర్‌కు లేదని.. తెలంగాణలో ఆ ప్లాన్ ఫెయిలవన్న నమ్మకంతో బీజేపీ హైకమాండ్ ఉంది. అందుకే ఇప్పటి నుండే ఎవరెవరికి టీఆర్ఎస్లో టిక్కెట్లు దక్కవని ప్రచారం జరుగుతుందో వాళ్లతో టచ్‌లో ఉండాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అందుకే కేసీఆర్‌కు ఈ సారి అంత ఈజీ కాదన్న వాదన టీఆర్ఎస్లోనే వినిపిస్తోంది.