అవును.. సీఎం రేవంత్ రెడ్డిపై పదేపదే విమర్శలు చేస్తోన్న బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు మాత్రం లోలోపల ఓ విషయంలో రేవంత్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అంటూ చర్చ జరుగుతోంది. దానంపై కేసు విషయంలో రేవంత్ నిర్ణయం పట్ల కాంగ్రెస్ నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అవుతున్నా, బీఆర్ఎస్ మాత్రం ఖుషీ, ఖుషీగా ఉండవచ్చు అంటున్నారు.
బీఆర్ఎస్ ను వీడిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ లో చేరారో కానీ, ఆయనకు ఇటీవల బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్లోని నందగిరిహిల్స్ లోని ప్రభుత్వ స్థలం కాంపౌండ్ ను కూల్చివేసిన ఘటనపై అందిన ఫిర్యాదుతో దానంపై హైడ్రా కేసు నమోదు చేసింది. దీనిపై హైడ్రా చీఫ్ పై దానం గరంగరం అయ్యారు. అధికార పార్టీ నేత అయినప్పటికీ నిబంధనలకు అతీతంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయాలనే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కేసు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.
ఈ పరిణామం పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ లోలోపల హర్షం వ్యక్తం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన దానంకు తగిన శాస్తి జరిగిందని, పైగా ఇది బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కూడా అవుతుందన్న ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ఎందుకంటే..గ్రేటర్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలపై భూఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హైడ్రా దూకుడుతో వారంతా అధికార పార్టీలో చేరినా ప్రయోజనం ఉండదని దానం ఎపిసోడ్ తో అంచనాకు వస్తారని, తద్వారా గ్రేటర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడరని అ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లుగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.