వివేకా హత్య కేసులో సీబీఐ పూర్తిగా చేతులెత్తేసినట్లుగా తెలుస్తోంది. విచారణ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని సీబీఐ నేరుగా న్యాయస్థానానికే చెప్పేసింది. ఎందుకంటే.. తమకు ఎవరూ సహకరించడం లేదని.. అధికారులు కూడా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపింది. ఈ కారణంగా విచారణ ముందుకు సాగడం లేదన్నారు. నిందితులు తమకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ పెట్టుకున్నారు.నిందితులు జైలు నుంచే సాక్షుల్ని బెదిరిస్తున్నారని.. వారికి బెయిల్ ఇవ్వొద్దని .. సీబీఐ వాదించింది. ఈ సందర్భంగానే విచారణ ఎంత కాలం ఉంటుందో చెప్పాలని సీబీఐని న్యాయస్థానం ప్రశ్నించింది.
దీంతో సీబీఐ చెప్పాలనుకున్నది చెప్పింది. ఎవరూ సహకరించనందున.. విచారణ ఎంత కాలమో చెప్పలేమని .. నేరుగానే చెప్పేసింది. తమకు బెదిరింపులు కూడా వస్తున్నాయని అయినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. సీబీఐ నిస్సహాయత.. ఎవరూ సహకరించని వైనంపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో కానీ.., సీబీఐకే… వివేకా హత్య కేసులో సవాళ్లు ఎదురవుతున్నాయని మాత్రం స్పష్టమయింది.
వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై కేసులే కాదు.. బాంబులేస్తామన్న బెదిరింపులు కూడా వచ్చాయి. మొదట్లో చాలాస్లోగా విచారణ చేసిన తర్వాత దూకుడుగా నిందితుల్ని బయట పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఒత్తిళ్లు పెరిగిపోవడంతో మళ్లీ సైలెంటయ్యారు. ఇప్పుడు విచారణ ఎంత కాలం పడుతుందో చెప్పలేమంటున్నారు. సహకరించే ప్రభుత్వం వస్తే తప్ప.. విచారణ చేయలేని పరిస్థితి ఉందని వారు చెప్పకనే చెప్పారు. అంటే.. వివేకా హత్య కేసులోనిందితులు ప్రభుత్వ రక్షణతో దర్జాగా బతికేస్తున్నారని సీబీఐ పరోక్షంగా చెప్పేసినట్లయింది.