జనసేన విడిగా పోటీ చేస్తేనే తమకు లాభమన్న ఉద్దేశంతో.. ఆ పార్టీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ సీరియస్‌గా ప్రయత్నించ లేదు. అదే సమయంలో… పవన్ కల్యాణ్ కూడా.. ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్నారు కాబట్టి.. టీడీపీతో పొత్తులు పెట్టుకోవడం మంచిది కాదనుకున్నారు. అయితే.. ఇప్పటికే.. జనసేన పార్టీ.. టీడీపీకి సన్నిహితం అనే ప్రచారం మాత్రం ఆగడంలేదు. దానికి ఇటీవల జరుగుతున్న పరిణామాలే కారణం అని.. వైసీపీ నేతలు.. బలంగానే వాదిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఆదివారం అకస్మాత్తుగా జనసేనలో చేరారు. చంద్రబాబు సూచనలతోనే ఈ వ్యవహారం సాగిందని వైసీపీ వర్గాలు ఇప్పటికే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. లక్ష్మీనారాయణ కొన్నిరోజులు రాజకీయ పార్టీ స్థాపిస్తానని చెబుతూ వస్తున్నారు. కానీ.. ఏ పార్టీలోనూ చేరలేదు. చివరికి టీడీపీలో చేరుతారని.. ఫలానా సీటు నుంచి పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది.కానీ.. టీడీపీలో చేరితే విమర్శలు వస్తాయన్న కారణంగా ఆయన జనసేనను ఎంచుకున్నారు. అలాగే.. హఠాత్తుగా పవన్ కల్యాణ్ లక్నో వెళ్లి బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతితో భేటీ అయి.. పొత్తు ప్రకటన చేశారు. గతంలో ఆయన లక్నో వెళ్లినా కలిసే అవకాశం దొకరలేదు. కానీ ఈ సారి మాత్రం అలా వెళ్లాగనే.. అపాయింట్ మెంట్ దొరకడం మాత్రమేకాదు.. మీడియాతో పొత్తు గురించి ప్రకటించారు. బీఎస్పీకి 21 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ సీట్లు కేటాయించేశారు పవన్. దీని వెనుక కూడా చంద్రబాబు హస్తముందనేది..వైసీపీ నేల ఆరోపణల.
అదే సమయంలో.. టీడీపీ అధినేత టిక్కెట్ల కేటాయింపులో.. చేస్తున్న జాప్యం కూడా.. జనసేన కోసమేనని ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్, లక్ష్మినారాయణ లాంటి వాళ్లపై డమ్మీ అభ్యర్థులను నిలబెట్టేందుకు ఆయన కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం లేదని చెబుతున్నారు. గాజువాక, భీమిలి, పెందుర్తి, విశాఖ లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. గాజువాకలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా ఆయన పేరును ఖరారుచేయలేదు. పెందుర్తిలో ఐదుసార్లు గెలిచిన సీనియర్ నేత మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి టికెట్‌ను కూడా చంద్రబాబు పెండింగ్‌లో పెట్టారు. ఈ పరిణామాలన్నీ.. టీడీపీ – జనసేన ఒక్కటేనన్న ప్రచారం జరిగేందుకు దోహదపడుతోంది. ఇది బలంగా ప్రజల్లోకి వెళ్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు… పోలరైజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది చంద్రబాబు చేస్తున్న వ్యూహాత్మక తప్పిదంగా చెప్పుకోవచ్చంటున్నారు.