తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ కాలేజ్‌ల కబుర్లు… అంటూ ఇక మీడియా రోజువారీగా ఓ కొత్త కాలమ్ రన్ చేసుకోవచ్చు. నిన్నా మొన్నటి దాకా వరుసపెట్టి జరిగిన విద్యార్ధుల ఆత్మహత్యలతో రెండు రాష్ట్రాల్లోనూ జర్నలిస్ట్‌లకు చేతినిండా పనికల్పించిన ఈ కార్పొరేట్ కాలేజ్ లు….ఇప్పుడు తమలో తమ మధ్య ఆధిపత్య పోరుతో వార్తల్లోకి ఎక్కాయి. అదెందుకో చెప్పాలంటే కాస్త ముందుకు అంటే ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాలి.
తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కార్పొరేట్ కాలేజ్ లు ఉన్నప్పటికీ… వాటన్నింటి వెల్లువకూ కారణమైనవి, విద్యార్ధి లోకంలో బాగా ప్రాచుర్యం పొందినవీ చైతన్య, నారాయణ కాలేజీలే అనేది తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ రెండు కాలేజ్‌ల మధ్య నిత్య అగ్నిహోత్రంలా పోటీ రగులుతుండేది. ఉప్పు, నిప్పులా ఉండే ఈ విద్యాసంస్థల మధ్య పోటీ తెలుగునాట మున్నెన్నడూ ఎరగని అనారోగ్యకర విధానాలకు తెరతీశాయి. రెండు మాఫియా ముఠాలను తలపించేలా సాగిన సమరంలో మీడియా ప్రకటనల పంట పండించుకోవడం తప్ప… అంతకు మించి ఏనాడూ వీటి పెడ ధోరణులను ఎండగట్టిన పాపాన పోలేదు.
దీంతో ఈ రెండు సంస్థలు పోటా పోటీగా రకరకాల అనైతిక విద్యా విధానాలకు పాల్పడ్డాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిభ ఉన్న విద్యార్ధులను నయానో భయానో తమ సంస్థల్లో జేర్పించుకోవడం, అలాగే ఫ్యాకల్టీల విషయంలో కూడా కిడ్నాప్‌ల వంటివాటికి పాల్పడడం వంటివి చేసేవారని విమర్శలు కూడ ఉన్నాయి. దొంగ ర్యాంకులు ప్రకటించుకోవడం, ఒకరి ర్యాంకుల మీద ఇంకొకరు దుమ్మెత్తి పోసుకోవడం… కూడా సాగాయి. నారాయణ పత్రికకు ఈనాడు, చైతన్య సంస్థకు సాక్షి… అన్నట్టు మీడియా కూడా విభజనకు గురైంది.
వీరి వ్యాపారంతో పాటు పోటీ కూడా బాగా ముదిరి పాకాన పడడంతో ఇలా కాదంటూ కొందరు మధ్యవర్తులు రంగ ప్రవేశం చేసి రాజీ కుదిర్చారు. దీని ప్రకారం చైతన్య నారాయణ రెండు సంస్థల పేర్లూ కలిసి వచ్చేలా, చైనా పేరుతో ఒక సంస్థ, దాని ఆధ్వర్యంలో కొన్ని విద్యాసంస్థలు, శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయడం… వగైరాలు జరిగాయి. మొత్తం మీద అప్పటి నుంచి తప్పనిసరి తధ్దినంలా వీరిద్దరి మధ్య ఊపిరిపోసుకున్న బీరకాయ పీచు బంధుత్వం పీచు పీచు మంటూ… ఇప్పుడు పుటుక్కుమనే దశకు వచ్చింది.
నిజానికి మొదటి నుంచి తెలుగుదేశం వాదిగా ఉన్న నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతోనే చైతన్య ఉలిక్కిపడింది. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి సర్ధుకున్నాయనుకున్న కొన్ని గొడవలు మళ్లీ ఊపిరిపోసుకున్నాయి. అలా అలా సాగుతూ… తాజాగా రెండ్రోజుల క్రితం తమ విద్యార్ధిని చైతన్య ఎత్తుకుపోయిందంటూ నారాయణ ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ముదిరి పాకానపడ్డాయి. ఈ ఉదంతం వేదికగా ఇరు వర్గాలు ఒకదానిని ఒకటి ఎండగట్టాయి. మీడియా సాక్షిగా దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. నువ్వు దొంగవి అంటే నువ్వు బందిపోటువి అంటూ తమ లొల్లితో పాటు లొసుగులూ బయటపెట్టేసుకుంటున్నాయి. గత కొన్నేళ్లుగా ఎన్నో అవమానాలు భరిస్తున్నామని ఇక నారాయణతో కలిసి తాము నడిచేది లేదని చైతన్య సంస్థ ప్రతినిధులు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కాబట్టి… వీరి కలహాల కాపురం ముగిసినట్టే అని భావించవచ్చు.
ఇదిలా ఉంటే… ఈ ఉదంతం చిలువలు పలవలు అవుతుండడంతో… ఇప్పుడు కొన్ని విషయాలు మరుగునపడుతున్నాయి గమనించారా? కార్పొరేట్ కాలేజ్ విద్యార్ధుల ఆత్మహత్యలు, తదనంతర పరిణామాలు , చర్చ అటకెక్కే అవకాశం కనపడుతోంది. నిజానికి ఎప్పటి నుంచో నానుతున్న తమ గొడవను అకస్మాత్తుగా ముదిరేలా చేయడం వెనుక ఈ సంస్థలు ఉమ్మడిగా ఆశించిన లాభం కూడా అదేనేమో అని కొందరు సందేహిస్తున్నారు.