తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వేదికగా.. ధర్మపోరాట దీక్ష చేశారు. తన వాదనకు.. బీజేపీయేతర పార్టీల నేతల మద్దతు కూడగట్టారు. అయితే.. ఈ పోరాటంపై.. భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆరాట పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ నేతలు.. ఏదైనా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారు. వారేమీ సర్వసంగ పరిత్యాగులు కాదు. ధర్మపోరాటంలో.. ధర్మం ఉందా లేదా.. అన్నది మాత్రమే ఇక్కడ చూడాలి..!
రాజకీయ నేతలు ఏదైనా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తారు..!
ప్రధాని నరేంద్రమోడీ సహా.. ఏ రాజకీయ నాయకుడు.. ఏ కార్యక్రమం చేపట్టినా అందులో రాజకీయ ఆరాటం కచ్చితంగా ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షలోనూ… అలాంటి ఆరాటం ఉంది. జాతీయ స్థాయిలో.. అన్ని పార్టీల ఐక్యతను ప్రదర్శించి.. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేసి.. ఏపీలో తన బ లం పెంచుకోవాలన్న రాజకీయ ఆరాటం ఉంది. అందులో అనుమానమేం లేదు. ఢిల్లీలో పోరాటం చేస్తే… బీజేపీ కదిలిపోయి.. మోడీ కరిగిపోయి.. ప్రత్యేకహోదా ఇస్తారనే పరిస్థితులు లేవు. కానీ.. బీజేపీ తీరును.. ఢిల్లీ స్థాయిలో ఎండగట్టడం కోసం.. ఈ దీక్ష ఉపయోగపడుతుంది. అయితే.. ఈ ఇష్యూ ధర్మమైనదా కాదా.. అన్నదే పాయింట్. రాజకీయ నేతలు రాజకీయాలే చేస్తారు. జగన్ అయినా.. పవన్ అయినా.. కార్యక్రమాలు పెడితే.. రాజకీయ ఆరాటంతోనే పెడతారు. అందుకే.. ఇష్యూ ధర్మమైనదా కాదా.. అన్నదే చూసుకోవాలి. ఈ లెక్కన చూస్తే.. ఏపీ ప్రత్యేకహోదా డిమాండ్ అడగడం ధర్మమైనదే.
చేసిన పోరాటంలో ధర్మం ఉందా లేదా అన్నదే ముఖ్యం..!
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. అమలు చేయనప్పుడు.. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు.. కేంద్రం తీరుపై.. తమ తమ పద్దతుల్లో నిరసన తెలియజేశాయి. చేస్తున్నాయి. అందులో భాగంగా.. చంద్రబాబునాయుడు… కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఒకప్పుడు… ఇదే చంద్రబాబునాయుడు.. ప్రత్యేకహోదా పోరాటం చేసిన ప్రజాసంఘాలు, వామపక్షాలు.. ఇతర నేతలపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు అదే ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తున్నారు. కొంత మంది కలసి వచ్చినా.. వైసీపీ, జనసేన, వామపక్షాలు మాత్రం కలసి రావడం లేదు. వారు ప్రత్యేకహోదా ఉద్యమాలు కూడా చేయడం లేదు. అంటే… చంద్రబాబు ప్రత్యేకహోదా పోరాటం చేసినప్పుడు.. మిగిలిన వాళ్లు… మొదట్లో వాళ్లు పోరాటం చేసినప్పుడు.. చంద్రబాబు కలిసి వెళ్లలేదు. ఇదే ప్రజలకు జరుగుతున్న అన్యాయం. ప్రత్యేకహోదా కావాలన్నది ప్రజలు, పార్టీల ఏకాభిప్రాయమన్నప్పుడు.. కలసి పోరాడాల్సిఉంది. కానీ కలసి పోరాడటం లేదు. అందరూ కలిసి పోరాటం చేసే వాతావరణం ఏపీలో లేదు.
అందరూ కలిసి పోరాడకపోవడమే ఏపీ ప్రజలకు నష్టం..!
ఎన్నికల రాబోతున్న సమయం కాబట్టి… బీజేపీయేతర పార్టీలు.. ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. ప్రతిపక్షాల ఐక్యతను.. చంద్రబాబు దీక్ష ఓ అవకాశం ఇచ్చింది. చంద్రబాబు దీక్షతోనే అందరూ ఏకం కాలేదు. ఇటీవలి కాలంలో… మమతా బెనర్జీ దీక్ష చేశారు. అనేక మంది మద్దతు తెలిపారు. ఈవీఎంలపై.. 22 పార్టీలు కలిపి… ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఇలా.. బీజేయేతర పార్టీలు అవకాసం దొరికినప్పుడల్లా.. ప్రతిపక్షాలు ఐక్యతను ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి.. ఈ ప్రయత్నాలు మరింత ఎక్కువగా చేస్తాయి. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబుకు ఉన్న పరిచయాలు, ఏపీ ప్రయోజనాలు.. ధర్మపోరాటంలో ఉన్నాయి కాబట్టి.. అన్నీ కలసి వచ్చాయి. ఈ దీక్ష చంద్రబాబు వ్యక్తిగత లాభం కోసం చేసిన దీక్ష కాదు. ఏపీ కోసం కాబట్టి.. తాము అండగా ఉన్నామని చెప్పేందుకు రాజకీయ పార్టీలన్నీ వచ్చాయి. ఈ వేదిక ప్రతిపక్షాలను ఏకం చేయడానికి ఉపయోగపడింది.