కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. ఓడిపోయామన్న బాధ, అధికారం మిస్ అయిందన్న ఆక్రోశంకు తోడు సోషల్ మీడియా వల్లే ఓడిపోయామన్న కసితో.. కేటీఆర్ టీం సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టి… కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు.
కానీ, గెలిచిన తర్వాత సైలెంట్ అయిన కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్స్ ను పట్టించుకున్న వారు చాలా తక్కువ. గంపగుత్తగా క్రెడిట్ తీసుకున్న సునీల్ కనుగోల్ కూడా తన టీంను చాలా తగ్గించారు. పాత వారంతా వెళ్లిపోయినా, కొత్తవారిని తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ కు ధీటుగా ప్రతిఘటించే వారే కాంగ్రెస్ కు కరువయ్యారు.
దీంతో వెంటనే సునీల్ టీంను యాక్టివేట్ చేయాలి, గాంధీ భవన్ నుండి సోషల్ మీడియా టీమ్స్ హడావిడి పెంచాలని మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు. బీఆర్ఎస్ దాడిని తట్టుకోలేకపోతున్నాము, కౌంటర్ లేకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని హెచ్చరిస్తున్నారు.
కానీ, నిజానికి మారాల్సింది సోషల్ మీడియా టీమ్స్ ఒక్కటే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా బీఆర్ఎస్ కు తెలిసిపోతుంది. ప్రభుత్వం కొత్త బ్రాండ్లకు అనుమతే ఇవ్వలేదు అని మంత్రి చెప్తే… ఆధారాలతో సహా ఇచ్చామని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆధారాలు బయటపెట్టింది. సుంకిశాల వాల్ కూలిపోతే వీడియోలు బయటకు తీసింది. ఇలా ఒకటి, రెండు కాదు… ప్రభుత్వంలో ఏం జరుగుతుందో, ఏ డిపార్ట్మెంట్ లో ఏ నిర్ణయాలు జరుగుతున్నాయో అన్ని బీఆర్ఎస్ కు చేరుతున్నాయి. దాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా పక్కాగా వాడుకుంటోంది. దీనికి పుల్ స్టాప్ పెట్టకుండా, కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్స్ సైజు ఎంత పెరిగినా ఉపయోగం ఉండదు. మీరు గతంలో ఏం చేశారు అని కౌంటర్ ఇవ్వటానికే తప్పా పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు.
కానీ, ఈ లాజిక్ ను కాంగ్రెస్ సర్కార్ మిస్సవుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సీఎం వచ్చాక తీసుకునే నిర్ణయాల్లో దీనిపై ఎంత వరకు ఫోకస్ చేస్తారో చూడాలి.